రక్షణ నాస్తి

రక్షణ నాస్తి

  • నాణ్యత లేని తుపాన్‌ షెల్టర్ల నిర్మాణాలు 

  • పర్సేంటేజ్‌లకు కక్కుర్తిపడి పట్టించుకోని అధికారులు  

  • రూ.10 కోట్లు నిధులు కొల్లగొట్టేందుకు మాస్టర్‌ప్లాన్‌

  • వాకాడు(గూడూరు): జాతీయ తుపాన్‌ విపత్తుల నివారణ పథకం ద్వారా ప్రపంచ బ్యాంక్‌ నిధులతో భారీ మొత్తం వెచ్చించి తుపాన్‌ షెల్టర్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇందులో రూ.10 కోట్ల నిధుల కొల్లగొట్టేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న తుపాన్‌ షెల్టర్ల నిర్మాణాలను పరిశీలిస్తే ఇవి ప్రజలు తలదాచుకోవడానికేనా..లేక కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికా అనే అనుమానం కలగక మానదు. కాంట్రాక్టర్ల అక్రమాలు, పర్సేంటేజ్‌ల కోసం అధికారుల కక్కుర్తి వెరసి తుపాన్‌ షెల్టర్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోంది.



    వాకాడు మండలంలోని మొనపాళెం, పామలతెరి, పంబలి, శ్రీనివాసపురం, పామంజి, కొండూరుపాళెం గ్రామాలకు ఆరు తుపాన్‌ షెల్టర్లు మంజూరయ్యాయి. ఒక్కో తుపాన్‌ షెల్టర్‌కు రూ.1.74 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను దాదాపుగా అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్లే దక్కించుకోవడంతో వారికి అడ్డుచెప్పేవారు లేక ఇష్టానుసారంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన భవనాల నిర్మాణంలో నాణ్యత లేని ఇసుక, సిమెంటు, కంకర వాడుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విపత్తులు సంభవించినప్పుడు తుపాన్‌ షెల్టర్‌లో తలదాచుకున్న ప్రజలకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  



    నాణ్యతకు నామం

    తీర ప్రాంతంలోని మత్స్యకారులు, ప్రజలు తుపాన్‌ సమయంలో ఉండడానికి వరల్డ్‌ బ్యాంక్‌ వారు మోడల్‌ రక్షిత భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. తుపాన్‌ షెల్టర్లు మన్నికగా ఉండేందుకు నాణ్యమైన ఇనుము, స్వర్ణముఖినదిలోని ఇసుక, 12 ఎంఎం, 20 ఎంఎం కంకరను మాత్రమే వాడాలి. కాని అలా జరగడం లేదు. నిర్మాణాలు చేపట్టే ప్రాంతంలోనే దొరికే తవుడు ఇసుకనే వాడుతున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే ఒక క్యూబిక్‌ మీటర్‌ నిర్మాణానికి 380 కేజీల నుంచి 420 కేజీల వరకు సిమెంటు వాడాలి. తక్కువ సిమెంటులో ఎక్కువ ఇసుకను వాడుతుండడంతో నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయి. మంజూరైన నిధుల్లో కనీసం సగం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.  



    పర్యవేక్షణ ఎక్కడ?

    తుపాన్‌ షెల్టర్ల నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నాణ్యత పాటించడం లేదు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్న పీఆర్‌ జేఈలను ఈ పనుల పర్యవేక్షణకు నియమించుకోవడం గమనార్హం. ఇటీవల తుపాన్‌ షెల్టర్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వచ్చిన ప్రపంచ బ్యాంక్‌ బృందాలను పనుల వద్దకు రానివ్వకుండా కాంట్రాక్టర్లు వారి పలుకుబడిని ప్రదర్శించి జాగ్రత్తలు పడినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి తుపాన్‌ షెల్టర్ల నిర్మాణాల పనులు నాణ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top