ఉపాధి ఫలం.. సీతాఫలం

ఉపాధి ఫలం.. సీతాఫలం - Sakshi


ఈసారి కాత అధికమే

గిరిజనులకు ఉపాధి



మెదక్‌ రూరల్‌: గత రెండేళ్లుగా ఏర్పడ్డ కరువుతో సీతాఫలాలు కూడా దొరకలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మెదక్‌ మండలంలోని పలు గ్రామాల్లో సీతాఫలాలు కాత బాగానే ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు శివారుల్లోని అటవీ ప్రాంతంలో గల చెట్ల నుంచి సీతాఫలాలు తీసుకొచ్చి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.


ముఖ్యంగా గిరిజనులు సమీప అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున సీతాఫలాలను సేకరిస్తున్నారు. వాటిని మాగబెట్టి పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. మండలంలోని శమ్నాపూర్, వెంకటాపూర్, మక్తభూపతిపూర్, తిమ్మానగర్, పాతూర్, రాయిన్‌పల్లి, గంగాపూర్‌ తదితర గ్రామాల గిరిజనులు సీతా ఫలాలను మెదక్‌ పట్టణానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.


రామాయంపేట పట్టణంలో జాతీయ రహదారి పక్కన నిత్యం సంత జరుగుతుంది. అక్కడి నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌ ప్రాంతాలకు ఈ సీతాఫలాలను భారీగా తరలిస్తుంటారు. మెదక్‌ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు చాలా వరకు అక్కడికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు.



రోజు కూలి పడుతుంది..

అటవీ ప్రాంతంలో చెట్లకు సీతాఫలాలు దొరుకుతున్నాయి. వాటిని అమ్ముకుంటే రోజు కూలి గిట్టుబాటైతుంది. కరువుతో గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా పనులు దొరుకతలేవు. చాలా ఇబ్బందులు పడ్డాం. సకాలంలో వర్షం పడక వేసిన మక్క పంట ఎండిపోయింది. సీతాఫలాలు ఉపాధినిస్తున్నాయి.

- బుజ్జి, వెంకటాపూర్‌ తండా



పంటలెండినా.. పండ్లు ఆదుకుంటున్నాయి..

సరైన సమయంలో వర్షాలు కురియక పోవడంతో వేసిన పంటలెండిపోనయి. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న మాకు సీతాఫలాలు ఉపాధినిస్తున్నాయి. అటవీ ప్రాంతంలోని చెట్ల నుంచి సీతాఫలాలు తీసుకొచ్చి మాగబెట్టి అమ్ముతున్నం.

- రమ, వెంకటాపూర్‌ తండా



 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top