అందని ‘ఉపాధి’ కూలి

అందని ‘ఉపాధి’ కూలి - Sakshi


పనులు చేసినా పస్తులే

రూ.కోటి వరకు బకాయిలు

► కరెన్సీ కొరత అంటున్న అధికారులు


ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని ఉపాధి హామీ కూలీలకు నిర్ణీత సమయంలో కూలి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌ డబ్బులు అందుబాటులో ఉన్న బ్యాంకుల్లో కరెన్సీ కొరతతో బ్యాంకర్లు డబ్బులు చెల్లించలేకపోతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది ఉపాధి కూలీల పరిస్థితి.


మండుటెండలను సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్నా బ్యాంక్‌ అధికారులు కనికరించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీలో భాగంగా గ్రామాల్లో రోడ్డు ఫార్మేషన్, వరద కట్టలు, ఫీడర్‌ కాల్వల నిర్మాణం, పొలాల మధ్య కాల్వలు, ఇంకుడు గుంతలు, చెక్‌ డ్యాంలలో పూడికతీత, హారితహారంలో మొక్కలు నాటడం, నీటి నిల్వ కట్టడాలు తదితర పనులు చేపట్టుతున్నారు.



మండలంలో కూలీల వివరాలు

ఆదిలాబాద్‌ రూరల్, మావల మండలాలల్లోని 23 గ్రామ పంచాయతీల్లో 1,065 శ్రమ శక్తి సంఘాలు ఉండగా, వీటిలో 8,200 మంది జాబ్‌ కార్డులు ఉన్నారు. ప్రతి రోజు 5వేల జాబ్‌ కార్డులు కలిగిన వారు సుమారు 7వేల మంది కూలీలు ప్రతి రోజు ఉపాధి హామీలో పనులు చేస్తున్నారు. కూలీలకు సరైనా సమయంలో కూలి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ఏప్రిల్‌ మాసం నుంచి కూలి డబ్బులు రావాల్సి ఉందని కూలీలు పేర్కొంటున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఉపాధి పనులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు.



రూ. కోటి వరకు బకాయిలు

మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ప్రతి వారం బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ ద్వారా (బీపీఏం) చెల్లింపులు జరుగుతాయి. గత ఏప్రిల్‌ మాసం నుంచి కూలీలకు సంబంధించి చెల్లింపులు జరగకపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మండలంలోని 7వేల మంది కూలీలకు రూ.కోటి వరకు చెల్లింపులు చేయవాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో డబ్బులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యాంకుల్లో కరెన్సీ కొరతతోనే బ్యాంకర్లు పోస్టాఫీసులు డబ్బులు అందించడం లేదని తెలుస్తోంది. అలాగే ఇటీవల ఆసరా పథకం కింద డబ్బులు చెల్లింపులు జరగడం కూడా ఒక ప్రభావం అని బ్యాంకర్లు పేర్కొంటున్నట్లు ఉపాధి హామీ అధికారులు అంటున్నారు. ఏదీ ఎమైనా ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించేలా అధికారులు చూడాలని పలువురు కూలీలు కోరుతున్నారు.



పని చేసినా పైసల్‌ రావడం లేదు

మండుటెండల్లో ఉపాధి హామీ పనులు చేసినా పనికి సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతుంది. ఆన్‌లైన్‌లోనైతే డబ్బులు ఉన్నాయాని చూపిస్తున్న బ్యాంకర్లు డబ్బులు ఇవ్వకపోవడంతో పోస్టాఫీస్‌ వాళ్లు డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబ్బులు టైం మీద అందేలా చూడాలి.

– కోరటి గంగన్న, ఉపాధి కూలీ, బట్టిసావర్‌గాం, మావల

బ్యాంకర్లు ఇవ్వడం లేదట

ఉపాధి హామీ పథకం కింద కూలీ పని చేసి నెల పదిహేను రోజులు అవుతుంది. ఇప్పటికీ కూలీ డబ్బులు రావడం లేదు. సకాలంలో డబ్బులు వస్తాయాని కూలీ పనులకు వెళ్తే నెలల తరబడి డబ్బులు రాకపోతే పని చేసి కూడా వెస్ట్‌ అవుతుంది. కిరాణా దుకాణాల్లో, ఇతర చోట్లా ఉద్దెర సామగ్రి తెచ్చుకున్నాం. ఇప్పుడు కూలీ డబ్బులు రాక తిరిగి మళ్లీ సామాన్‌ తీసుకుందాం అంటే ఇబ్బంది పడుతున్నాం.

ఆర్‌.మల్లేశ్, ఉపాధి కూలీ, బట్టిసార్‌గాం, మావల

కరెన్సీ కొరత ఉందంటున్నారు

గత నెల పదిహేను రోజుల నుంచి కూలీలకు సంబంధించిన డబ్బులను చెల్లించాల్సి ఉన్న మాట వాస్తమే. కూలీలకు సంబంధించిన డబ్బులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్యాంకర్లు కరెన్సీ కొరత ఉందని చెబుతున్నారు. దీంతో పోస్టాఫీసులకు బ్యాంకర్లు డబ్బులు ఇవ్వకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. ఈ విషయంపై బ్యాంకర్లతో సైతం మాట్లాడడం జరిగింది. డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం.

శామ్యూల్, ఏపీవో, ఆదిలాబాద్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top