సాగు ‘సౌర’భం

సాగు ‘సౌర’భం

ఆరు గ్రామాల్లో సౌర విద్యుత్‌తో సాగు

రాయితీపై నెడ్‌క్యాప్‌ మోటార్లు పంపిణీ

బిల్లుల భారం తగ్గడంతో రైతుల హర్షం

 

బొబ్బిలి రూరల్‌ : చలిదేశమైన జర్మనీలో ఏటా 150 రోజులు కూడా సూర్యకాంతి ఉండదు. కానీ ఆ దేశ విద్యుత్‌ సామర్థ్యంలో 30 శాతం సౌర విద్యుత్‌ వాటా ఉంది. మనకు సౌర కాంతి పుష్కలం.. వినియోగం అంతంతమాత్రం. కానీ ఇప్పుడిప్పుడే సౌర విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. వేళాపాళా లేని విద్యుత్‌ కోతలతో రైతాంగం విసిగి వేసారిపోతోంది. నెడ్‌క్యాప్‌ అందిస్తున్న సౌర విద్యుత్‌ పరికరాలతో ఆధునిక వ్యవసాయం చేస్తోంది. బొబ్బిలి మండలంలో వంద ఎకరాల్లో సాగు ‘సౌర’భం వెదజల్లుతోంది.

 

సాగునష్టాలు తగ్గుముఖం

ఇరవైనాలుగ్గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. విద్యుత్‌ మోటార్లతో వ్యవసాయం రైతులకు కష్టమవుతోంది. ఈ తరుణంలో సౌర విద్యుత్‌ మోటార్లతో సాగు నష్టాలను తగ్గిస్తోంది. నెడ్‌క్యాప్‌ ద్వారా రైతులకు 5 హెచ్‌పీ, 3 హెచ్‌పీ మోటార్లు నడిచే సోలార్‌ విద్యుత్‌ పరికరాలను ట్రాన్స్‌కో అధికారులు సరఫరా చేస్తున్నారు. రైతులు రూ.55 వేలు చెల్లిస్తే రూ.4,45,000 విలువైన సౌర విద్యుత్‌ పరికరాలను రాయితీపై అందిస్తున్నారు.

 

ఆరు గ్రామాల్లో సౌర విద్యుత్‌తో సాగు

 అలజంగి, చిత్రకోట బొడ్డవలస, శివడవలస, డొంగురువలస, పిరిడి, కారాడ గ్రామాల్లో రైతులు సౌర విద్యుత్‌తో పంపుసెట్లను వినియోగిస్తున్నారు. విద్యుత్‌ కోత సమస్యల్లేకుండా హాయిగా సాగు చేసుకుంటున్నారు. ఈ గ్రామాల రైతులు బడి గౌరునాయుడు, బడి అప్పలస్వామి, మెరుపుల తిరుపతినాయుడు, పెద్దింటి సత్యనారాయణ తదితరులు సౌర విద్యుత్‌తో పనిచేసే పంపుసెట్లను వినియోగిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు.  

 

 

విద్యుత్‌ బిల్లుల బాదుడే లేదు

నెడ్‌క్యాప్‌ ద్వారా అందించిన సౌర విద్యుత్‌ పరికరాలతో మోటార్లు చక్కగా పనిచేస్తున్నాయని.. ఖర్చు ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందోనని నిరీక్షించాల్సిన అవసరం లేనేలేదంటున్నారు. గతంలో విద్యుత్‌ లేక నానా ఇబ్బందులు పడేవారు. రాత్రివేళ ఎప్పుడిస్తారో తెలియక వేచి ఉండేవారు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. గతంలో విద్యుత్‌ కోతలు, వర్షాభావంతో పంటలు పండేవి కావు. ప్రస్తుతం సౌర విద్యుత్‌తో నిరాటంకంగా నీరందుతున్నందున పంటలు పండుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్‌ బిల్లు కూడా భారీగా ఆదా అవుతోంది. 

 

వరుస క్రమంలో సౌర విద్యుత్‌ పరికరాలు

ఇప్పటివరకు మండలంలో 18మందికిపైగా రైతులు దరఖాస్తు చేసారని, వరుస క్రమంలో అందరికీ అందిస్తున్నామని ట్రాన్స్‌కో ఏఈ శశిభూషణరావు తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రత ఉన్నా వీటి బ్యాటరీలు చార్జింగ్‌ అవుతాయని, వెలుతురున్నా పనిచేస్తాయని తెలిపారు.

 

యాభై శాతం విద్యుత్‌ బిల్లు ఆదా: పెద్దింటి సత్యనారాయణ

సౌర విద్యుత్‌ మోటార్లు బాగా పనిచేస్తున్నాయి. మోటార్లు పగలంతా 11 గంటల పాటు పనిచేసినా వ్యవసాయ పనులకు సరిపడా నీరందుతోంది. దాదాపు 50 శాతం విద్యుత్‌ బిల్లులు ఆదా అవుతున్నాయి.

 

 

ఏడాదిగా సౌర విద్యుత్‌తో సాగు: బడి అప్పలస్వామి

 ఏడాదిన్నరగా సౌర విద్యుత్‌తో వ్యవసాయం చేస్తున్నాను. దీదంతో విద్యుత్‌ సమస్య పరిష్కారమైంది. విద్యుత్‌ సమస్యలతో వ్యవసాయం చేయలేమేమో అని ఒకప్పుడు ఆందోళన చెందేవాళ్లం. ఆ దిగులు పోయి ప్రస్తుతం ఎంతో ధీమాగా ఉన్నాం.

 

దరఖాçస్తు చేశా: గొల్లు సూర్యనారాయణ

విద్యుత్‌ సమస్యతో వ్యవసాయం చేయడం ఇబ్బందిగా ఉంటోంది. చాలామంది రైతులు సౌర విద్యుత్‌తో సాగు చేస్తున్నారని తెలిసి ఈమధ్యే ఈ పరికరాల కోసం దరఖాస్తు చేశాను. అవి మంజూరైతే బాగా వ్యవసాయం చేయగలను.

 

వందెకరాల్లో సౌర విద్యుత్‌తో సాగు : ఎం.శ్యామసుందరరావు

 బొబ్బిలి మండలంలో దాదాపు 100 ఎకరాల్లో సౌర విద్యుత్‌ పరికరాలతో సేద్యం చేస్తున్నారు. మంచి రాయితీలిస్తున్నందు వల్ల రైతులు మరింత ముందుకొస్తే మంచి ఫలితాలుంటాయి. విద్యుత్‌ కోత సమస్యలుండవు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top