ఆంధ్రులను నట్టేట ముంచింది: రామకృష్ణ


విజయవాడ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆంధ్రప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని, ప్రత్యేకహోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును రాజ్యసభలో చర్చకు రాకుండా అడ్డుకుని దగా చేసిందని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఆగస్టు 5న మరోసారి చర్చకు రానున్న ప్రత్యేకహోదా బిల్లును ఆమోదించకపోతే రాష్ట్ర బంద్ చేపట్టి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


రాజ్యసభలో బిల్లుపై చర్చజరగకుండా ఆపడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నగర కమిటీల ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటిస్తే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చిందన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలోనూ ప్రకటన చేశారన్నారు.



బీజేపీ కప్పదాటు వైఖరి అవలంభిస్తోందన్నారు. ప్రత్యేకహోదాపై ప్రగల్భాలు పలికి ప్రజలతో సన్మానాలు చేయించుకున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నేడు తప్పించుకుతిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాపై కపటనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారులు దోబూచులాట మాని ఆగస్టు 5న తిరిగి చర్చకు రానున్న ప్రత్యేక హోదా బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మారోమారు రాష్ట్ర బంద్ చేయడం ద్వారా పాలనను స్తంభింపజేస్తామన్నారు.



ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రత్యేక హోదా కావాలంటూనే దాన్ని అడ్డుకుంటున్న బీజేపీతో పొత్తుకొనసాగిస్తోందన్నారు. టీడీపీకిప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ అధికారంలో లేనపుప్పుడు ఒకమాట, అధికారం వచ్చాక మరో మాట మాట్లాడడం బీజేపీ,టీడీపీలకు పరిపాటిగా మారిందన్నారు.


రెండేళ్లుగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ,సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్, సహాయ కార్యదర్శి జి కోటేశ్వరరావు, పల్లా సూర్యారావు, మహిళా సంఘం, ప్రజానాట్యమండలి, యువజన , విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top