'టీడీపీలో సంకర రాజకీయాలు'


- తెలంగాణలో పార్టీ మారితే గగ్గోలు పెట్టి.. ఇక్కడెందుకు చేర్చుకుంటున్నారు?

- సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు






విజయనగరం : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్సాఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి ఎందుకు చేర్చుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఒకలాగా, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరినప్పుడు మరోలా మాట్లాడటం సరికాదని చెప్పారు.



విజయనగరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి, చంద్రబాబు నడుపుతున్న టీడీపీకి ఎంతో తేడా ఉందన్నారు. చంద్రబాబు కలుషితమైన, సంకర రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ ఉద్యమాలను నిర్మిస్తుందని చెప్పారు. ఇటువంటి ఉద్యమాలకు లౌకికవాదులు, సమాజహితం కోరేవారు మద్దతు ఇవ్వాలని కోరారు.



పార్టీ మరో సంయుక్త కార్యదర్శి జె.వి.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టనట్లుగా ఉందన్నారు. మజ్జిగతోనే ప్రజల మంచినీటి సమస్యలు తీరాయని ప్రభుత్వం భావించినట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యను ప్రొత్సహించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ విద్యను కొనసాగించాలని వచ్చేనెల 2న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. సీపీఐ విజయనగరం జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో వచ్చే నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర గిరిజన సమాఖ్య 5వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top