ప్రదర్శనలు నిర్వహిస్తే దోమలు పోతాయా?


అనంతపురం రూరల్‌: దోమలను నిర్మూలించేందుకు ప్రభుత్వం దండయాత్రల పేరుతో జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తే దోమలు పోతాయా? అని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలే దోమలు నిర్మూలించుకొవాలి? పరిసరాలను శుభ్రంగా ఉంచుకొవాలని ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం తమ బాధ్యతల నుండి తప్పుకుంటోందని విమర్శించారు.


దోమల నివారణకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచలేదని ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా మరణించిన వారు ఏ జ్వరంతో మరణించారో స్పష్టంగా జిల్లా ప్రజలకు తెలపాలన్నారు.  నగరాలను మురికి కూపాలుగా మర్చి ప్రజలను జ్వరాల బారిన పడేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. హెల్త్‌డే పాటిస్తే విషజ్వరాలు తగ్గవని ప్రతి రోజు డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి ఫాగింగ్, స్ప్రేయింగ్‌ చేపడితే తగ్గుతాయన్నారు.


ప్రజల జీవన ప్రమణాల మెరుగు పర్చాలని డిమాండ్‌ చేస్తూ నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటి కార్యాలయాలను సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణస్వామి, బి. రమణ, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top