గో రక్షణ పేరుతో...గోల్‌మాల్‌...

గో రక్షణ పేరుతో...గోల్‌మాల్‌...

- మల్లేపల్లిలో మూన్నాళ్ల ముచ్చటగా సురభి కామధేను ట్రస్టు

- మూగజీవాల పేరిట వ్యాపారం

- హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యంతో చర్చనీయాంశం 

- అధికారులకు తలనొప్పిగా మారనున్న విచారణ, నివేదిక 

జగ్గంపేట : గోవుల రక్షణ పేరుతో గోల్‌మాల్‌...ట్రస్టు ముసుగులో సాగుతున్న బాగోతం ప్రజావ్యాజ్యంతో బట్ట బయలైంది. హైకోర్టు జోక్యంతో ఇటు రెవెన్యూ...పోలీసు యంత్రాంగంలో కదలిక ఏర్పడడంతో లోగుట్టులో డొంకంతా కదులుతోంది. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున మూగజీవాల పోషణంటూ ఏర్పాటు చేసిన సురభి కామధేను ట్రస్టులో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మల్లేపల్లిలో జాతీయ రహదారి పక్కన కూళ్ళ కృష్ణ అనే వ్యక్తి స్థలం, షెడ్లను అద్దెకు తీసుకుని సురభి కామధేను ట్రస్టును గత ఏడాది అక్టోబరు 5న రిజిస్టర్‌ చేయించారు. సోమాని సురేష్‌కుమార్‌ చైర్మన్‌గా, గార్లంక రాంబాబు, దాసరి ప్రసాద్‌లు వైస్‌ చైర్మన్లుగా, కార్యదర్శిగా సుమన్‌చంద్ర విడితి, కోశాధికారిగా బావిశెట్టి ఉదయ్‌ పుష్కరం పేర్లను ట్రస్టుకు కార్యవర్గంగా పేర్కొన్నారు. అక్టోబరు నుంచి ట్రస్టు వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులను రప్పించుకొని వాటి ఆలనా, పాలనా చూస్తున్నట్టు నటించారు. అది నిజమేననుకొని అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల్ని కూడా పోలీసులు ఈ ట్రస్టుకు అప్పగించేవారు. ఈ విధంగా ఏలూరు, తణుకు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువుల సంఖ్య సుమారు వంద వరకూ ఉండేవి. వీటికి ఆహారం, నీరు అందజేయకపోవడంతో రోజు,రోజుకూ బక్కచిక్కిపోవడంతో స్థానికుల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీనస్థితి నుంచి చనిపోయే దుస్థితికి చేరుకోవడంతో మల్లేపల్లికి పురోహితులు, చింతా అరుణ్‌ కుమార్‌ శర్మ, తదితరులు పశువులకు స్వచ్ఛందంగా గ్రాసాన్ని అందించారు. 

బయటపడిందిలా...

అయితే ట్రస్టుకు తీసుకువచ్చే పశువులను కబేళాకు తరలిస్తున్నారన్న విమర్శలు రావడంతో టి.చంద్రశేఖర్‌ అనే వ్యక్తి ప్రజావ్యాజ్యం పిటీషన్‌ను హైకోర్టులో దాఖలు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. పశువులను సంబంధిత యజమానులకు అప్పగించారని పోలీసులు కోర్టుకు నివేదించగా అప్పటి జిల్లా కలెక్టరు అరుణ్‌ కుమార్‌ మాత్రం ఆ ట్రస్టు ఆవరణలో పశువులు లేవని, నిర్వాహకులు కూడా లేరని నివేదిక ఇచ్చారు. ఈ రెండు నివేదికలు భిన్నంగా ఉండడంతో మళ్లీ దర్యాప్తునకు కోర్టు ఇటీవల ఆదేశించడంతో కదలిక ప్రారంభమయింది.

రైతులు ఇచ్చిన పశువులు కూడా...

పాల దిగుబడి తగ్గిన తరువాత పశు యజమానులు, రైతులు పశు పోషణ చేయలేక గో రక్షణ కమిటీలకు, ఆశ్రమాలకు అందజేస్తారు. ఇలా అందజేసిన పశువులు కూడా ట్రస్టు నిర్వాహకులు మాయం చేశారు. సేవ ముసుగులో ఆవులు, గేదెలను వేలాది రూపాయలకు కబేళాలకు, ఇతరులకు విక్రయించేశారని ఆరోపణలున్నాయి. వ్యాన్లపై అక్రమంగా తరలించేవాళ్లను కూడా బెదిరించి లక్షలాది రూపాయలు వసూళ్లు చేసిన ఘటనలు కూడా ఉన్నాయని పరిసర ప్రాంత గ్రామస్తులు చెబుతున్నారు. రక్షణ కోసమేనని ...మంచి పని చేస్తున్నారని మేం కూడా సహకరించామని, ఇలా చేస్తారని అనుకోలేదని వాపోయారు. ఈ వ్యవహరంలో పోలీసుల ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ట్రస్టుకు అప్పగించిన పశువులు ఎక్కడకు పోయాయి, ట్రస్టు వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను విచారణకు ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై స్పందించేందుకు ట్రస్టు నిర్వాహకులు అందుబాటులో లేరు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top