అదిగో మాఫియా

అదిగో మాఫియా

టాస్క్‌ఫోర్స్‌ :  జిల్లాలో గోమాఫియా రెచ్చిపోతోంది. గోవుల అక్రమ రవాణా వాహనాలను సరిహద్దులు దాటించేందుకు దళారులు తయారయ్యారు.  దీనికి రాష్ట్రంలోని కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,  పోలీసు అధికారులు, రిటైర్డ్‌ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నేతలూ సహకరిస్తున్నట్టు సమాచారం. ఫలితంగా  శ్రీకాకుళం,  విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జిల్లా మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు లక్షలాది పశువుల అక్రమ 

రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. బంగ్లాదేశ్‌కు కూడా గోవుల రవాణా అవుతున్నట్టు సమాచారం. అక్రమ వాహనాలను జిల్లా సరిహద్దులు దాటించడం ఇక్కడి మాఫియా ప్రధాన పని. దీనికోసం కొందరు వ్యక్తులు పైలెట్లుగా కూడా వ్యవహరిస్తున్నారు.  

రాష్ట్ర సరిహద్దు నుంచి రవాణా

రాష్ట్ర సరిహద్దు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పశువులను ఆయా మార్కెట్లలో కొని అక్రమార్కులు హైదరాబాద్‌ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటైనర్లలో మూగజీవాలను ఎక్కించి కుక్కుతున్నారు. పైన టార్పాలిన్‌ కప్పి అనుమానం రాకుండా చూసుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఎటువంటి ఆంటకాలు లేకుండా వాహనాలు వచ్చినా.. జిల్లాలోకి ప్రవేశించే సరికి పోలీసులకు సమాచారం అందడం, వెంటనే పోలీసులు లారీలను సీజ్‌ చేయడం చేస్తున్నారు. అయితే కొందరు పోలీసులు పశువులు రవాణా చేస్తున్న వ్యక్తులతో కుమ్మక్కై వారికి సమాచారం ఇచ్చినా లారీలను వదిలేస్తున్నారు. ఇటీవల గోపాలపురంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.  

పెద్దల ప్రమేయం 

ఈ దందాలో ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వారితోపాటు పోలీసు అధికారులు, రిటైర్డ్‌ పోలీసు అధికారులు ఈ మాఫియాకు సహకరిస్తున్నట్టు సమాచారం. ఇందులో కొందరు మీడియా వ్యక్తులూ ఉన్నట్టు తెలుస్తోంది.  ఇటీవల కొయ్యలగూడెంలో పోలీసులు గోవులు రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని సీజ్‌చేయగా.. సాక్షాత్తు రాజధాని ప్రాంతానికి చెందిన ఒక ఉన్నత ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే కేసు నమోదు కావడంతో పోలీసులు చేతులెత్తేశారు. 

పంథా మార్చిన గో మాఫియా 

జిల్లా మీదుగా సరిహద్దును దాటించేందకు గోమాఫియా పంథాను మార్చింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలను సీజ్‌చేస్తే వాటిని గోశాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు జంగారెడ్డిగూడెంలో ఒక బృందం ప్రత్యేకంగా గోశాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. ఒకవేళ ఈ దారిలో పశువుల అక్రమ రవాణా వాహనాలు సీజ్‌చేస్తే తామున్నామంటూ గోసంరక్షణ సమితి పేరుతో కొందరు ప్రత్యక్షమై ఆ గోశాలకు వాహనాలు తరలించి వదిలేసేలా పథకం పన్నారు.  దీని కోసం ఇటీవల రాజమండ్రిలో జరిగిన సమావేశంలో లక్షలాది రూపాయలకు బేరం కుదిరినట్టు సమాచారం.

తరలించడానికి రూ.లక్ష 

జిల్లా సరిహద్దు దాటించేందుకు ఒక్కొక్క వాహనానికి రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు దళారులు, సరిహద్దు దాటించే వ్యక్తులు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ మొత్తాలను హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారులు నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తారని తెలుస్తోంది. 

పండగల నేపథ్యంలో 

జూన్‌నెలలో వచ్చే కొన్ని పండగల నేపథ్యంలో ఇప్పటి నుంచే అధిక సంఖ్యలో పశువులను హైదరాబాద్, బంగ్లాదేశ్‌ తరలించాల్సి ఉంది. ఇప్పటి నుంచి చేస్తేగానీ సరిపడా పశువులు రవాణా జరిగే అవకాశం లేదు. దీంతో మాఫియా మరింత చెలరేగుతోంది. అధిక సంఖ్యలో గోవులను తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దళారులు ఒకొక్కరు కనీసం అనుకున్న సమయానికి 2వేల టన్నుల గోవులను రవాణా చేయాలని ఒప్పందాలు కుదిరినట్టు సమాచారం.  దీంతో జిలా ్లమీదుగా రవాణా చేయడానికి ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు లాబీయింగ్‌ జరుగుతోంది.   

పెద్దల సిండికేట్‌ 

 

జిల్లాలోని  దళారులు ఇటీవల వరకూ కొవ్వూరు నుంచి జిల్లా సరిహద్దు జీలుగుమిల్లి వరకూ ఉన్న దారిలో గోవుల వాహనాలను తరలించేవారు.  ఈ దారిలోని దళారుల మధ్య ఇటీవల విభేదాలు పొడచూపాయి. దీంతో అక్రమార్కులు రూట్‌ మార్చి జాతీయ రహదారిలో ప్రధాన రహదారి గుండుగొలను, భీమడోలు, రాజుపోతేపల్లి, కామవరపుకోట, చింతలపూడి మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి పంపడం ప్రారంభించారు. దీంతో దళారులు కొందరు వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు కొత్త దారి చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల అక్రమ రవాణా పెద్దలు దళారులను తిరిగి సిండికేట్‌ చేసే యత్నం చేశారు. 10 రోజుల క్రితం రాజమండ్రిలో జిల్లాకు చెందిన దళారులు, సరిహద్దు దాటిస్తున్న వ్యక్తులను ఒక హోటల్‌లో సమావేశపరిచారు. రిటైర్డ్‌ పోలీసు అధికారులు వారి మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేశారు. దీని కోసం మూడు సార్లు సమావేశమై రూ. లక్షల్లో బేరాలు కుదిర్చినట్టు తెలిసింది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top