రైతు ఆత్మహత్యలపై ఏపీ, తెలంగాణ కౌంటర్లు


సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాల్లో తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అదనపు కౌంటర్ దాఖలు చేసింది. వీటికి తిరుగు సమాధానాలు (రిప్లై) ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేయడంతో పాటు రైతు ఆత్మహత్యల నివారణకు 2006లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేలా ఉభయ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.



ఈ వ్యాజ్యంలో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాం అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మెదక్ జిల్లాకు చెందిన పాకాల శ్రీహరి గతేడాది పిల్ దాఖలు చేశారు. దీంతో పాటూ తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ.లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, మరొకరు గత వారం పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి ధర్మాసనం సోమవారం విచారించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top