పత్తి పాయె..

ఎర్రబారిన పత్తి చేను

  • వరుస వర్షాలతో పత్తి రైతుకు తీరని నష్టం

  • రాలిపోయిన కాయలు, పింజల్లో నుంచి మొలకలు

  • పంట నష్టం అంచనా వేయాలని కోరుతున్న రైతులు

  • వరుసగా కురుస్తున్న వర్షాలు.. చేలలోని పత్తి పంటను చేతికి రాకుండా చేశాయి.. మొక్కలపై ఉన్న పత్తి పింజలు తడిచి ముద్దయ్యాయి.. కొన్ని రాలిపోతుండగా.. మరికొన్ని మొలకలు వస్తున్నాయి.. చేతికొచ్చే అరకొర పంట కూడా ధర పలకని పరిస్థితి.. తొలుత వర్షాలు కురవక అంతంతమాత్రంగా ఉన్న పంట ఇప్పుడు వర్షాలతో ఎందుకూ పనిరాకుండా పోతోంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు చేలలోని పంటలను చూసి ఆందోళన చెందుతున్నారు.

    - మధిర

    వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. మండలంలోని మాటూరుపేట, మాటూరు, నిధానపురం, సిరిపురం, దెందుకూరు, తొర్లపాడు తదితర గ్రామాల్లో పత్తి పింజలకు మొలకలు వచ్చాయి. కొన్ని చేలల్లో పత్తి పింజల నుంచి మొలకలు రావడమే కాకుండా.. రెండు మూడు ఆకులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 1,52,970 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది 1,28,482 హెక్టార్లలో సాగు చేశారు. మధిర నియోజకవర్గంలో 33వేల హెక్టార్లలో పత్తి సాగు చేయాల్సి ఉండగా.. ఈ ఏడాది 26వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఖరీఫ్‌ మొదట్లో సకాలంలో వర్షాలు కురవక పత్తిలో ఎదుగుదల లోపించింది. దీనికితోడు చీడపీడలు ఆశించడంతో వేలాది రూపాయలు వెచ్చించి పురుగు మందులు పిచికారీ చేశారు. చెట్టుకు 10 నుంచి 20 పత్తి కాయలు కాశాయనుకుంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ కాయలు నల్లబడ్డాయి. పత్తి ఆకులు నిలువునా ఎండిపోతున్నాయి. చెట్టుకు నాలుగైదు కాయలు పక్వానికి వచ్చి పత్తి తీసేందుకు సిద్ధంగా ఉండగా.. వర్షానికి పత్తి పింజల్లో నుంచి మొలకలు వస్తున్నాయి. ముదురుగా కాసిన కాయలకు ఆకులు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుతం ఉన్న కాపు ఒక్కో ఎకరానికి రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా జిల్లావ్యాప్తంగా పత్తి పంటకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. మొలకలు వచ్చి నష్టం కలుగుతున్న పంటలవైపు అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలపై పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం జోరుగా కురుస్తున్న వర్షానికి చేతికొస్తున్న పత్తి ఆగమైపోతుండటంతో రైతన్నల ఆశలు ఆవిరైపోయాయి. బాధిత రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి చేతికి వస్తున్నప్పటికీ సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి.. తడిచిన పత్తికి సైతం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.



    పత్తి రైతులను ఆదుకోవాలి..

    జోరుగా కురుస్తున్న వర్షానికి పత్తి పింజల నుంచి మొలకలు వస్తున్నాయి. తొలుత వర్షాలు సరిగా కురవక పత్తి అంతంతమాత్రంగా ఉంది. తీరా పత్తి చేతికి వస్తున్న దశలో కురుస్తున్న వర్షానికి పత్తి పింజల్లో నుంచి మొలకలు వస్తున్నాయి. పత్తి నాణ్యత తగ్గిపోతుంది. కాయలు పూర్తిగా నల్లబడ్డాయి. ఇటువంటి పత్తిని వ్యాపారులు ఎంతరేటుకు అడుగుతారో తెలియదు. తడిచిన పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

    - గూడూరు నాగిరెడ్డి, రైతు, నిధానపురం  



    సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..

    పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎర్రనల్లి, పిండినల్లి ఆశించి ఎర్రబారుతుంది. పోషకాల లోపం వల్ల, అధిక వర్షాలకు ఎర్రబారే అవకాశం ఉంది. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫినిల్‌ 2 మి.లీ, పిండినల్లి నివారణకు లీటరు నీటికి 3మి.లీ ప్రొఫినోఫాస్‌ లేదా కాపరాక్సీక్లోరైడ్‌ 2 గ్రాముల మందును పిచికారీ చేయాలి. పోషక లోపాల నివారణకు 19:19:19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి.

    - వేల్పుల బాబురావు, ఏడీఏ, మధిర



     

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top