ధర తెల్లబోయింది!

ఆదోని యార్డుకు అమ్మకానికి వచ్చిన పత్తి

– ఆదోని యార్డులో పతనమైన పత్తి ధర

 

ఆదోని: పత్తి ధర ఒక్కసారిగా పతనమైంది. సోమవారం క్వింటా రూ.3,999-రూ.5,150 మధ్య పలకడంతో మోడల్‌ ధర రూ.4,891లుగా నమోదయింది. గత వారం చివరి రోజుతో పోల్చుకుంటే క్వింటాపై రూ.400 తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక దశలో వ్యాపారులు మోసం చేస్తున్నారంటూ ఆవేదనకు లోనయ్యారు. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో దూది కండి(356 కిలోలు)పై వెయ్యి రూపాయల దాకా.. పత్తి గింజలు క్వింటాపై రూ.200 పైగా తగ్గడంతో స్థానిక మార్కెట్‌పైనా ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు రోజుల విరామం తర్వాత యార్డుకు 17,577 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. క్వింటాపై రూ.500 పైగా ధర తగ్గడంతో రైతులు దాదాపు రూ.కోటి మేర నష్టపోయారు.

 

దసరాతో ఆనందం ఆవిరి

దాదాపు పక్షం రోజుల క్రితం యార్డులో క్వింటా ధర గరిష్టంగా రూ.6,800 వరకు పలికింది. దీంతో దసరా పండుగను రైతులు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అయితే అప్పటికి రైతుల చేతికి పత్తి దిగుబడులు పూర్తిగా అందలేదు. ప్రస్తుతం గరిష్టస్థాయిలో పత్తి కోత సాగుతోంది. క్వింటాళ్ల కొద్దీ పత్తి రైతుల ఇళ్లకు చేరుతోంది. ఆర్థిక అవసరం ఉన్న రైతులు వెంటనే అమ్మకానికి యార్డుకు తెస్తున్నారు. అయితే దసరా అనంతరం క్రమేణా పత్తి ధరలు పతనమవుతున్నాయి. దసరా ముందు రోజుతో పోలిస్తే క్వింటాపై దాదాపు రూ.1500 దాకా రైతులు నష్టపోతున్నారు. ధరల పతనంతో దసరా పండుగతోనే తమ ఆనందం ఆవిరవుతూ వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పత్తి ధరలు రూ.5,800 దాకా పలుకుతుండగా.. ఆదోనిలో మాత్రం బాగా తగ్గిపోయిందని, వ్యాపారులు సిండికేట్‌గా మారి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని దేవనకొండ మండలానికి చెందిన రైతు బసప్ప ఆరోపించారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top