అవినీతి పుష్కరం.. అంతా రహస్యం

అవినీతి పుష్కరం.. అంతా రహస్యం

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోట్లాది రూపాయలను వెచ్చించి చేపట్టిన పుష్కర పనుల్లో అవినీతి రాజ్యమేలిందని సాక్ష్యాలతో సహా రుజువైంది. గోదావరి పుష్కరాల సందర్భంగా చేసిన పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తనిఖీలు నిర్వహించి పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు నిర్ధారించింది. సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి నివేదిక సైతం సమర్పించింది. అయినా ఇంతవరకూ ఈ వ్యవహారంపై ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు నోరు మెదపటం లేదు. 

కొవ్వూరులో అవినీతి రూ.14 కోట్ల పైమాటే

కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో చేసిన రూ.14 కోట్లకు పైగా విలువైన పనుల్లో అవినీతి జరిగిందని, పనుల్లో నాణ్యత లోపించిందని వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాయి. వాటిని ప్రయోగ శాలల్లో సాంకేతికంగా పరిశీలించి పనులు పూర్తి నాసిరకంగా ఉన్నాయని తేల్చింది. ఈ దృష్ట్యా కొవ్వూరు మున్సిపాలిటీకి రూ.50 లక్షల జరి మానా వి«ధించడంతోపాటు.. పక్కదారి పట్టిన నిధులను సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్‌  విభాగం ప్రభుత్వానికి నివేదించింది. ఈ పనులు చేసిన వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో ఈ నివేదికను ప్రభుత్వం ఏడాది కాలంగా తొక్కిపెట్టినట్టు సమాచారం. విజిలెన్స్‌  అధికారులు తనిఖీలు చేసి నమూనాలు తీసుకువెళ్లారే తప్ప.. ఇప్పటివరకూ దీనిపై ఏవిధమైన ఆదేశాలు తమకు రాలేదని ఇంజినీరింగ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

హడావుడి పనులతో కానిచ్చేశారు

2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా కొవ్వూరులో వివిధ పనులను హడావుడిగా చేశారు. గోష్పాద క్షేత్రం వద్ద 5 కిలోమీటర్ల పరిధిలో సీసీ రోడ్లు, గోదావరి మాత విగ్రహం నుంచి గామన్‌  బ్రిడ్జి వరకూ ట్యాంక్‌ బండ్, గోష్పాద క్షేత్రంలో తాత్కాలికంగా నిర్మించిన పిండ ప్రదానం షెడ్లు, కొవ్వూరు పట్టణ పరిధిలో నందమూరు రోడ్డు,  రైల్వే బ్రిడ్జి మీదుగా రైల్వేస్టేషన్‌  వరకూ రోడ్డు, మురుగునీటి పారుదల డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. పట్టణ పరిధిలోని డివైడర్లు, జంక్షన్లు, పార్కుల సుందరీకరణకు రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఏటిగట్టుపై లాన్‌  గడ్డివేసి æహడావుడిగా మొక్కలు నాటారు. వీటికి కనీసం నీళ్లు పోసే నాథులు లేకపోవడంతో పుష్కరాలు మొదలయ్యే నాటికే ఎండిపోయాయి. గోదావరి మాత విగ్రహం నుంచి గోష్పాద క్షేత్రం వరకు ఐదు బ్లాకుల్లో సుమారు కిలోమీటరుకు పైగా పార్కులు ఏర్పాటు చేశారు. ఈ పనులతోపాటు మూడు ఘాట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. వీటికి సంబంధించిన నమూనాలను విజిలెన్స్‌  అధికారులు సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఇదిలావుంటే.. పట్టణంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని పుష్కర యాత్రికుల కోసం ప్రతిపాదించారా.. రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు  వేసుకునేందుకు చేస్తున్నారా అని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తనిఖీల సందర్భంగా మునిపిపల్‌ కమిషనర్‌పై మండిపడ్డారు. అప్పట్లో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు రోడ్డు పనులను విజిలెన్స్‌  అధికారులు తనిఖీ చేశారు. ఈజీకే రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ నుంచి పుష్కర నగర్‌కే వెళ్లే రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రావెల్‌ వాడకంలో మూడు శాతం పనుల వ్యత్యాసం వచ్చినట్టు కూడా అప్పట్లో నిర్ధారించారు. గ్రావెల్‌ పొర వేయడంలో 20 మిల్లీమీటర్ల మందం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. వీటికి సంబంధించిన మొత్తాలను కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఇంత జరిగినా విజిలెన్స్‌ ఇప్పటివరకూ నివేదికలు బయటకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top