అవినీతి చుట్టూ.. నీరు-చెట్టు


 టీడీపీ నాయకులకు కల్పతరువుగా మారిన నీరు-చెట్టు

 పొలాలకు తరలించాల్సిన చెరువు మట్టి ప్రైవేటు ప్లాట్లలోకి..

 పుట్లంపల్లి చెరువులో రూ.9లక్షల దొంగ బిల్లులు..!

 


వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పథకం తెలుగుదేశం పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. ఇందులో రూ.5లక్షల వరకూ నామినేషన్‌పై ఇచ్చే  వీలుండటంతో నాయకుల అవినీతికి అంతేలేకుండా పోయింది. నిష్పక్షపాతంగా వ్యవహరించి రైతులకు మేలు చేయాల్సిన ఇరిగేషన్ అధికారులు అధికారపార్టీ నేతల బెదిరింపులకు తలొగ్గి వారు చెప్పినట్లు తలాడిస్తున్నట్లు స్పష్టమవుతోంది.



కడప కార్పొరేషన్: పాత కడపలో ప్రస్తుతం నీరు-చెట్టు పథకం మొదటి విడత కింద రూ. 35లక్షలతో పనులు జరుగుతున్నాయి.  నిబంధనల ప్రకారం చెరువులో తీసిన మట్టిని రైతుల పొలాల్లోకి ఉచితంగా తరలించి భూసారాన్ని పెంచాల్సి ఉంది. కానీ పాతకడప చెరువులో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ఆ  మట్టిని ట్రాక్టర్లతో ప్రైవేటు ప్లాట్లలోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ట్రిప్పుకు రూ. 300 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. బైపాస్ పక్కనే ఉన్న ఒక ప్రైవేటు స్థలంలోకి ఈ మట్టినంతా తరలిస్తున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.  మటి ్టతోలుతున్న ప్రాంతానికి చుట్టూ ఉన్నది పొలాలే కాబట్టి ఈ మట్టి పొలాల్లోనే తోలుతున్నట్లు అందరూ పొరపాటు పడతారు, కానీ అది వాస్తవం కాదు. బైపాస్‌కు ఆనుకొని ఉన్న ఈ స్థలంలో మట్టితోలి ఎత్తు పెంచడం ద్వారా డాబాలు ఇతరత్రా వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా ఉండేందుకే ఇలా మట్టితోలి ఎత్తుపెంచుతున్నట్లు సమాచారం. ఇలా రెండువైపులా కాంట్రాక్టర్ అక్రమంగా ఆర్జిస్తున్నా పట్టించుకోని అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.



 లక్ష రూపాయల పనికి పదిలక్షలు బొక్కేశారు

 పుట్లంపల్లి చెరువులో నీరు-చెట్టు పథకం కింద చేసిన పనులు అత్యంత నాసిరకంగా చేసినట్లు స్పష్టమవుతోంది.  ఒక వరుస క్రమం లేకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ మట్టి త్రవ్వినట్లు కనబడుతోంది. ఈ గుంతలు కూడా పైపైన తీయడం వల్ల వర్షపు నీరు నిల్వ ఉంచేందుకు ఇవి ఏమాత్రం ఉపయోగపడవని తెలుస్తోంది. ఈ మాత్రం పనులకు రూ. 10లక్షలు చెల్లించాలని సదరు కాంట్రాక్టర్ అధికారపార్టీ జిల్లానేత ద్వారా  అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్యూబిక్ మీటర్ల ప్రకారం కొలిస్తే ఆ పని విలువ కేవలం లక్షరూపాయలేనని తెలిసింది. ఇంత తక్కువ పనికి అంత మొత్తంలో బిల్లు చేయలేమని ప్రకటించిన అధికారిని బెదిరించి బిల్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.



 టీడీపీలో చేరిన వారికి దోచిపెట్టడానికే...

 ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు, నాయకులకు దోచిపెట్టడానికి నీరు-చెట్టు పథకాన్ని ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుగ్గవంకలో కూడా ఇలాంటి పనులను చేయించి డివిజన్ల వారి గా పంపకాలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  ప్రజలకు శాశ్వతంగా మేలు చేకూర్చే పనులు చేయకుండా ఇలాంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై నగర వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.



 విజిలెన్స్ విచార ణ చేయిస్తాం - ఇరిగేషన్ ఎస్‌ఈ

దీనిపై ఇరిగేషన్ ఎస్‌ఈ శంకర్‌రెడ్డిని వివరణ కోరగా నీరు-చెట్టు పథకంలో త్రవ్విన మట్టిని రైతుల పొలాల్లోకి మాత్రమే తరలించాలన్నారు. అందుకు విరుద్ధంగా తోలినట్లు తేలితే  విజిలెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పుట్లంపల్లిలో జరిగిన పనులపై కూడా విచారణ చేస్తామని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top