అభివృద్ధి మాటున అవినీతి..!


నల్లగొండ జిల్లా నీలగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి మాటున అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటన్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం సైతం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కోట్లాది రూపాయల మున్సిపాలిటీ సొమ్ము పక్కదారి పడుతోంది.



నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీలో చేసిన పాత పనులకే కొత్త బిల్లులు సృష్టించి మున్సిపాలిటీని కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు బేరం కుదిరితే చాలు.. ఎక్కడా ఏదీ ఎలా బిల్లు చేయాలో చకచకా చేసేస్తారు. పట్టణంలో అభివృద్ధి మాటున అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందనడానికి ఇక్కడ వీరు చేసిన పనులే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతిఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మున్సిపల్ పట్టణాల్లో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేస్తున్నారుు. ఈ నిధులు అక్రమార్కులకు వరంగా మారాయి. పట్టణంలో అభివృద్ధి ఎంత చేస్తున్నారో తెలియదు గానీ అవినీతిలో ముందంజలో ఉన్నారు.



నీలగి రి మున్సిపాలిటీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలలో రాష్ట్రంలోనే టాప్‌గేర్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈ మున్సిపాలిటీపై రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో ఇక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను తమ చుట్టాలుగా మలుచుకొని తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి రూ.కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నా రు. మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఔట్ సోర్సిగ్ ఉద్యోగి నుంచి అధికా రి వరకు తాము చేసిందే చట్టం అనే స్థాయికి ఎదిగిపోయారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

 

విజిలెన్స్‌కు ఫిర్యాదులు..

పట్టణంలోని ప్రకాశం బజారులో ఓ కాంట్రాక్టర్ పాత పనులకే బిల్లులు తయారు చేయించాడు. ఇక్కడ దాదాపు రూ.4 లక్షల వరకు బిల్లులు చేశారు.  ఉన్న డ్రెయినేజీ కాల్వకే కొత్తగా సిమెంట్ వేసి బిల్లులు కాజేశారు. స్థానికులు విజిలెన్స్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బిల్లు కూడా పూర్తి చేసి డబ్బులు కూడా మంజూరు చేశారు. ఫిర్యాదు తీవ్ర రూపం దాల్చడంతో ఆదే గుత్తేదారు 36వ వార్డులో చేసిన డ్రెయినేజీ పనులలో రీకవరీ చేశారు. అక్కడ రూ.2 లక్షల పనిచేయగా రూ.3 లక్షల విలువైన డ్రెయినేజీ పనులు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు తెలసి ంది. అధికారులకు అవినీతి భాగోతం తెలిసినా వారిమీద గానీ, కాంట్రాక్టర్ మీద గానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని వెనకేసుకు రావడం కొసమెరుపు.

 

రోడ్డు తక్కువ.. బిల్లులు ఎక్కువ


 పట్టణంలో పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంలో కూడా అవినీతికి తెరలేపారు. వన్‌టౌన్ పరిధిలోని ఓ వార్డులో వేసిన సీసీ రోడ్డు కన్నా 60 మీటర్ల దూరం ఎక్కువగా చూపించి బిల్లులు చేశారు. ఇలా ఒక్క వార్డులోనే కాదు అత్యధిక వార్డుల్లో తప్పుడు కొలతలు వేసి మున్సిపాలిటీ నిధులు బుక్కేస్తున్నారు. ఈ విషయాలన్ని అధికారులకు తెలసినా వారు చేతులు కాలాకా ఆకులు పట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పట్టణంలోని మున్సిపాలిటీలో జరిగిన అవినీతిలో ఇవి మచ్చుకు మాత్రమే.  

 

ప్రత్యేక దోపిడీ..


నాలుగేళ్ల పాటు మున్సిపాలిటీకి పాలకమండళ్లు లేకపోవడంతో ప్రత్యేకధికారి పాలన సాగింది. అప్పట్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత పాలక పక్షం చెబుతుంది. డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంలో అప్పటి అధికారి ద్విపాత్రాభినయంలో అందినకాడికి పక్కదారి పట్టించారు. తనకు నచ్చిన వారిని ఆయా విభాగాలలో పెట్టుకోని మంత్రాంగం నడిపించి కోట్ల రూపాయలు వెనకేసున్నట్లు తెలుస్తుంది. వారు చేస్తే దండించేది పోయి వారికి రక్షణగా నిలవడంతో అవినీతి హద్దే లేకుండా కొనసాగిపోతోంది.



యూజీడీలో..

పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కానీ దీనిపై నేటికీ నివేదిక రాలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.

 

 రూ.కోట్లు కొల్లగొడుతున్నారు..

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అభివృద్ధి పనులను టెండర్ల ద్వారానే చేపట్టాలి. ప్రభుత్వ మార్గద ర్శకాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకోని అవినీతి పంట పండిస్తున్నారు. లక్ష రూపాయల లోపు పనులుగా విభజించి పనులు చేపడుతూ కొటేషన్ల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షల పనులను పది పనులుగా విభజించి ఎవరికి అనుమానం రాకుండా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్ల  ద్వారా పనులు చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవినీతి అక్రమాల భారీ స్థాయిలో జరుగుతాయని ఒకరిద్దరు అధికారులు అభ్యంతరం జెప్పినా పై స్థాయి అధికారులు పెడచెవిన పెటట్డంతో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యమే.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top