చర్యలు శూన్యం

చర్యలు శూన్యం - Sakshi


ఐటీడీఏలో అవినీతి పరులను  పట్టించుకోని ప్రభుత్వం

తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కులు

మరికొంత మంది ఇంకా దోచేస్తున్న వైనం


సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఐటీడీఏలో అయితే మరీ చెప్పనక్కర్లేదు. అధికారులే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడుగా ఇప్పటికీ కొంతమంది తమ అక్రమాలను కానిచ్చేస్తుండగా, ఇప్పటికే అక్రమాలు చేసి, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన కొంతమంది అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు పక్క జిల్లాలకు బదిలీలు చేసుకున్నారు.



ఉపకార వేతనాల కుంభకోణాల తరహాలోనే ఐటీడీఏలో చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉపకార వేతనాల కుంభకోణంలో మొత్తం 11 మందిని అరెస్టు చేయడంతో సంచలనం రేగింది. దీనిలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఒక డీడీ, ఏటీడబ్ల్యూవో, ఇద్దరు హాన్‌రోరియం డైరెక్టర్లు ఉన్నారు. వీరి అరెస్టు సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో గతంలో నిధులు దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.



ఎరువుల కుంభకోణంలో రూ. 90 లక్షల దుర్వినియోగం

ఐటీడీఏ టీపీఎంయూ మండలాలైన సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ఉద్యానవన రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ఏడాదిన్నర క్రితం రూ. 2 కోట్ల నిధులు వెచ్చించారు. ఉద్యానవన శాఖ ద్వారా వీటిని అందించాల్సి ఉంది. అయితే ఎరువులు, పురుగు మందులు పూర్తిస్థాయిలో సరఫరా చేయకుండా చేసినట్టు రికార్డులు చూపి నిధులు కైంకర్యం చేశారు.



రూ. 90 లక్షల మేర నిధులు దుర్వినియోగం కావడంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ కూడా చేశారు. అయితే ఆ విచారణ ఏమైందో తెలియని పరిస్థితి. అలాగే ఎరువులు పంపిణీ చేయకుండా స్థానిక హెచ్‌ఎన్‌టీసీలో ఉంచడం, తర్వాత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వాటిపై ఆరాతీయడం వంటివి జరిగాయి. అయితే సంబంధిత పీహెచ్‌వోకు ఇతర జిల్లాలకు బదిలీ జరిగింది తప్ప చర్యలు చేపట్టలేదు.


హౌసింగ్‌ అక్రమాలపై చర్యలేవి?

ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపి చాలాచోట్ల నిధులను హౌసింగ్‌ సిబ్బంది కాజేశారు. సుమారు రూ. 2 కోట్ల మేర వీటిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఎటువంటి చర్యలు లేవు. మళ్లీ కొంతమంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లకు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు కట్టబెట్టినట్టు తెలిసింది.



మరోవైపు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌శాఖలో అక్రమాలకు అడ్డూ అదుపు లేదు.గతంలో ఇంజినీరింగ్‌శాఖ ద్వారా నిర్మించిన రహదారుల్లో 42 చోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.వీటిపై విచారణ చేయాలని పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు నిలదీశారు. పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తీర్మానించారు. విచారణ అతీగతి లేదు. బాలబడులు, న్యూట్రీషియన్‌ కేంద్రాల్లో సుమారు రూ. 2 కోట్లు అక్రమాలు జరిగాయని ఆ శాఖాధికారులే గుసగుసలాడుకుంటున్నారు. దీనిపై విచారణ చేశారు. అనంతరం సంబంధిత ఏపీఎంలకు వేరే జిల్లాల్లో పోస్టింగ్‌లు సైతం ఇచ్చేశారు. దీనిపై ఎటువంటి చర్యలు లేవు. రెండేళ్ల క్రితం మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీ నిధులు ఎంఆర్‌సీలో స్వాహా జరిగాయి. వాటిపై విచారణలు తప్ప చర్యలు శూన్యం.



ఐటీడీఏ పీవో ఏమన్నారంటే...

ఈ విషయాలపై ఐటీడీఏ పీవో ఎల్‌.శివశంకర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. పాత కుంభకోణాల విషయమై పరిశీలించాల్సి ఉందన్నారు.



అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందే

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. ఐటీడీఏలో కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగితే గిరి జన సంక్షేమ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎటువంటి విచారణలు చేపట్టడంలేదు. ప్రభుత్వం అవినీతి పరులకు కొమ్ముకాస్తుంది. ఇప్పటికైనా స్పందన రావాలి. నిజాలు నిగ్గుతేల్చాలి.         

– విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top