అవినీతి, అసమర్థ పాలన

అవినీతి, అసమర్థ పాలన


♦ ఫాంహౌస్‌కు వందసార్లు వస్తారు.. పక్కనే ఉన్న రైతుల గోస పట్టదా?

♦ {పజాగ్రహంలో టీఆర్‌ఎస్ కొట్టుకుపోక తప్పదు

♦ రుణమాఫీని ఏకమొత్తంలో అమలు చేయాల్సిందే

♦ మెదక్ జిల్లా రైతు భరోసా యాత్రలో సీఎంపై కాంగ్రెస్ నేతల ఫైర్

 

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అవగాహనలేని అసమర్థ, అవినీతి పాలన. ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వంద సార్లు వచ్చిపోతున్న ముఖ్యమంత్రికి పక్కనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే సమయం కూడా లేదా?’ అనిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మెదక్ జిల్లాలో జరిగిన రైతు భరోసా బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభతో ముగి సింది.



ఇస్లాంపూర్‌లో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఆకుల వెంకటేశ్ కుటుంబాన్ని, శివ్వం పేట మండలం దొంతిలో శంకర్ రైతు కుటుం బాన్ని నేతలు పరామర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే తమ గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటికి పంపారని ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు సహాయం చేయడం పోయి జబర్దస్తీ చేస్తున్నారని విమర్శించారు. రూ. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో రైతుల రుణాలను ఏకమొత్తంలో ఇవ్వడానికి రూ. 8,500 కోట్లు లేవా? అని ప్రశ్నించారు.



ఐదేళ్ల కాలంలో నాలుగు దఫాలుగా చెల్లిస్తామని చెబుతున్న డబ్బులు రైతు రుణాల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. చైనా పర్యటనకు రూ 5 కోట్లు, ఆయన ప్రత్యేక హెలీకాప్టర్‌కు రూ. 5 కోట్లు, మంత్రుల కార్లకు రూ. 30 కోట్లు ఖర్చు చేయడానికి ఉంటాయిగానీ, రైతులకు ఇవ్వడానికి ఆయనకు మనుసు రావటం లేదా.. అని దుయ్యబట్టారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి ఉంటే రైతుకు కొంత మేలు జరిగేదని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మీద వచ్చే ఐదేళ్ల కాలానికి రూ 70 వేల కోట్ల అప్పు భారం పడుతుంద న్నారు.



శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మాటల గారడీకి, అబద్ధాలకు మోసపోయి ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారన్నారు. త్వరలో జరగబోయే నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ 49 రోజులు ఆఫీ సుకు రాని సీఎం ప్రపంచంలో ఎక్కడైనా ఉం టారా? అని ప్రశ్నించారు.



తెలంగాణ సమాజానికి ఓర్పుతోపాటు తిరగబడే గుణం ఉందని, జనం తిరుగబాటులో కేసీఆర్ కొట్టుకుపోతారని హెచ్చరించారు. తుమ్మల నాగేశ్వర్‌రావు లాంటి ద్రోహులు ఉన్న తర్వాత బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీతారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top