‘అక్రమ’మే అధికం..!


మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జీఐఎస్‌(జియోగ్రఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) సర్వే చేపట్టింది. ఖమ్మం కార్పొరేషన్‌లో అనుమతి ఉన్న నిర్మాణాల కంటే అనుమతి లేనివే అధికంగా ఉన్నట్లు తేలింది. అనుమతి తీసుకుని నిర్మాణాలు చేపట్టగా.. అందులో అదనంగా నిర్మించిన కట్టడాలు కూడా బయటపడ్డాయి. దీంతో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలపై కార్పొరేషన్‌ అధికారులు జీఐఎస్‌ సర్వే నిబంధనల ప్రకారం నూరు శాతం అపరాధ రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జీఐఎస్‌ సర్వే చేపట్టకముందు కార్పొరేషన్‌ పరిధిలోని రికార్డుల ప్రకారం 29వేల నిర్మాణాలు ఉండేవి. సర్వే చేపట్టిన తర్వాత మొత్తం 62వేల నిర్మాణాలు ఉన్నట్లు లెక్క తేల్చారు.  ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనమైన తొమ్మిది పంచాయతీలను మినహాయించి కేవలం స్పెషల్‌ గ్రేడ్‌గా ఉన్న సమయంలో 11 రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే సర్వే చేపట్టడం గమనార్హం. కార్పొరేషన్‌గా మారకముందు రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 19వేల నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 11వ వార్డులోనే జరగడం గమనార్హం. దీంతో ఆయా నిర్మాణాలపై అపరాధ రుసుము వసూలు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.



రూ.2కోట్లకుపైగా ఆదాయం

జీఐఎస్‌ పూర్తి చేసిన తర్వాత అనుమతులు తీసుకున్న వాటికంటే.. అదనంగా చేపట్టిన నిర్మాణాలు నగరంలో 5,200 ఉన్నట్లు గుర్తించారు. ఆయా నిర్మాణాల యజమానుల వద్ద నుంచి పెరిగిన పన్నుతోపాటు జీఐఎస్‌ అపరాధ రుసుము నూరు శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా కార్పొరేషన్‌కు రూ.కోటి మేర ఆదాయం లభించనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌ పరిధిలో అసలు అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలు 25వేలకు పైగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు అసలు అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు సైతం అపరాధ రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. దీంతో అపరాధ  రూ.కోటి మేర లభించే అవకాశాలున్నాయి. జీఐఎస్‌ సర్వే పుణ్యమా అని కార్పొరేషన్‌కు రూ.2కోట్ల మేర ఆదాయం లభించనుంది. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను రూపంలో రూ.13కోట్ల మేర ఆదాయం లభిస్తుండగా.. ఈ ఏడాది మరో రూ.2కోట్ల మేర ఆదాయం లభించనుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top