కొత్త భవనం.. కుదరని ముహూర్తం

కొత్త భవనం.. కుదరని ముహూర్తం


ఖమ్మం: ‘కార్పొరేషన్‌లోని ప్రణాళిక విభాగం కార్యాలయం.. ఒక పక్క నగరంలోని భవనాలకు సంబంధించిన ఫైళ్లతోనే నిండి ఉంటుంది.. ఇద్దరు కలిసి అధికారి వద్దకు వస్తే కనీసం నిల్చునేందుకు స్థలం ఉండదు.. పట్టణ ప్రణాళిక అధికారి ముందు కూర్చునేందుకు వీలుండదు..’ ఇదీ ఖమ్మం కార్పొరేషన్‌లో చాలీచాలని గదులతో కొనసాగుతున్న పాలన. వందేళ్ల క్రితం నిర్మించిన పాత భవనం.. దానికి అనుబంధంగా నిర్మించిన రెండు భవనాలు ఇప్పుడు కార్పొరేషన్‌కు పరిపాలనా భవనాలుగా మారాయి.



 పాలనా సౌలభ్యం కోసం కొత్త భవనం నిర్మించాలనే ప్రణాళిక సైతం ముందుకు సాగడం లేదు. 1942లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న ఖమ్మం కార్పొరేషన్ వ్యాపార, వాణిజ్యంతో అతి తక్కువ కాలంలో కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. పాలన సక్రమంగా నిర్వహించి.. ప్రజల ఇబ్బందులు తీర్చే పరిపాలనా భవనం మాత్రం మారడం లేదు. కార్పొరేషన్‌గా ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ పరిపాలన భవనం రూపురేఖలు మారడం లేదు.   కార్పొరేషన్‌లో 3,56,000 మంది జనాభాతో.. 50 డివిజన్లుగా ఏర్పడింది. 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నగరంలో కార్పొరేషన్ లెక్కల ప్రకారం 98,548 ఇళ్లు ఉన్నాయి. రోజూ వివిధ అవసరాల నిమిత్తం కార్పొరేషన్‌కు వస్తుంటారు. దీంతోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను చేయించుకునేందుకు ఇక్కడికే రావాల్సి ఉంది.  

 

 సిబ్బంది సతమతం..

 కార్పొరేషన్‌లో ప్రస్తుతం 99 మంది సిబ్బందికి.. 67 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పరిపాలనా విభాగంలో 27 మందికి.. 22 మంది, రెవెన్యూ విభాగంలో 18 మందికి.. 13 మంది, అకౌంట్స్ విభాగంలో ఒకరు, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ విభాగంలో 20 మందికి.. 13, ఇంజనీరింగ్ విభాగంలో 14 మందికి.. 9 మంది, టౌన్ ప్లానింగ్ విభాగంలో 22 మందికి.. తొమ్మిది మంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు పారిశుద్ధ్య విభాగంలో వివిధ డివిజన్లలో పనిచేసే వందలాది మంది కార్మికులను ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత భవనంలో మున్సిపల్ మేనేజర్‌తోపాటు కొందరు విధులు నిర్వహిస్తుండగా..



అనుబంధంగా నిర్మించిన భవనాల్లో చాలీచాలని గదుల్లో జనన, మరణ ధ్రువీకరణ, పట్టణ ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ శాఖలతో కమిషనర్ కార్యాలయం నడుస్తున్నాయి. కార్పొరేషన్‌లోని కౌన్సిల్ హాల్ వద్ద మేయర్ కార్యాలయం ఉంది. సుమారు రూ.వెయి కోట్ల మేరకు ఆదాయం కలిగి ఉన్న కార్పొరేషన్‌కు కొత్త భవనం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికోసం ఎన్‌ఎస్‌పీ వద్ద నాలుగున్నర ఎకరాల స్థలం కేటాయించారు. భవనాన్ని డిజైన్ చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. ఇటీవల అది మరుగున పడింది.  

 

 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణంతో  వెనక్కు..

 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్త కలెక్టరేట్ భవిష్యత్‌లో నిర్మిస్తే.. అక్కడే కార్పొరేషన్ కార్యాలయం ఉండేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కొత్త భవన నిర్మాణం అంశం మరుగున పడినట్లు తెలుస్తోంది. మూడు లక్షల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండటంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన కార్పొరేషన్‌కు ప్రత్యేక భవనం అవసరం ఎంతైనా  ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top