కార్పొరేషన్‌ ఎన్నికలు లేనట్టే


► తేల్చేసిన మంత్రి నారాయణ

► ఎన్నికలకు వెళితే పరాభవం తప్పదని సర్వేల్లో వెల్లడి


► ఏక కాల ఎన్నికలకు స్థానికత ముడి


 


తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలుపై గత కొంత కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెరదించారు. దేశ వ్యాప్తంగా ఏక కాల ఎన్నికలకు కేంద్రం యోచిస్తోంద ని చెబుతూ స్థానిక ఎన్నికలు కూడా అప్పుడే నిర్వహించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు మంత్రి నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేవని, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఏక కాల ఎన్నికలతోనే నిర్వహించనున్నట్టు తేల్చి చెప్పారు. ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టంలేకపోయినా మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలని చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం కొత్తగా ఏక కాల ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల నుంచి పారిపోయేందుకు సిద్ధమైంది. ఊరిస్తూ వచ్చిన ఎన్నికల సందడిపై నీళ్లుచల్లడంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోంది.  


 


అనుకున్నదే అయ్యింది


 


రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుంటి సాకులు చెబుతూ ఎన్నికలకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో న్యాయస్థానం దీనిపై స్పందిస్తూ కంటెంట్‌ను విధించింది. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఏడాది క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. 


 


అయితే అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలను పంపుతూ వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ కాల యాపన చేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. దీంతో ఈసీ కూ డా కుల, మహిళా ఓటర్ల గ ణనకు ఆదేశించింది. ప్రసుత్తం ఈ నెల చివరికి పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా సిద్ధం కానుంది. ఎన్నికలపై అందరికీ అనుమా నం వున్నా మ రో రెం డు మూడు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగుతాయనే అనుకున్నారు. ఈ సమయంలో ఏక కాల ఎన్నికల పేరుతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లడంలేదని తేల్చేసింది.


 


సర్వేల్లో వెనుకంజే కారణమా?


తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. ప్రజల్లో అధికార పార్టీ బలం ఏ మేరకు ఉంది.. తెలుగదేశం పార్టీ ఎన్నికల హామీల అమలుపై ఏమనుకుంటున్నారు.. కాపు రిజర్వేషన్, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గుర్తించేందుకు ఇలా 18 ప్రశ్నలతో సర్వేను నిర్వహించారు. ఏకంగా ప్రభుత్వం రంగంలోకి దిగి గత ఏడాదిలోనే మూడు పర్యాయాలు తిరుపతిలో కులం, మహిళా, యువత ఆధారంగా వేర్వేరుగా సర్వే చేసింది.



అన్ని సర్వేల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయినా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని, ఆ ఫలితాల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఊహించని విధంగా మేధావి వర్గం అధికార పార్టీ అభ్యర్థులను చిత్తు చేయడంతో కార్పొరేషన్‌ ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదని భావించింది. ఇదే సమయంలో ఏక కాల ఎన్నికలు తెరైకి రావడంతో దీనికి ముడిపెడుతూ కార్పొరేషన్‌ ఎన్నికలపై నీళ్లు చల్లేశారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top