సార్వత్రిక సమ్మెకు సహకరించాలి

సార్వత్రిక సమ్మెకు సహకరించాలి

ఒంగోలు టౌన్‌ : పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2వ తేదీ నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు అన్నివర్గాలు సహకరించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల జిల్లాశాఖల ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్‌ చౌదరి, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.మోహన్, వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా నాయకుడు డీఎస్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రిస్తామంటూ రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీలు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ధరలు నియంత్రించకపోగా, మరింత పెరిగేందుకు ఊతమిస్తున్నాయని విమర్శించారు.

 

ప్రభుత్వాల చర్యలను ఎండగడుతూ అన్నివర్గాల ప్రజలు సార్వత్రిక సమ్మెలో పాల్గొని తమ సత్తా చాటాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్‌డీ సర్దార్, ఎస్‌కే మస్తాన్, వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు దామా శ్రీనివాసులు, బి.వెంకట్రావు, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, ఆర్టీసీ, మెడికల్‌ రిప్స్, మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

 

కార్మికుల శ్రమను దోచుకునేలా చట్టాలా..?

కార్మికుల శ్రమను దోచుకునేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలకు రూపకల్పన చేస్తోందని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.మోహన్‌ విమర్శించారు. కార్మికులను కార్పోరేట్‌ శక్తులకు బానిసలుగా చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2వ తేదీ నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

 

స్థానిక పీడీఎస్‌యూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఐఎఫ్‌టీయూ జిల్లా అనుబంధ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు 12 డిమాండ్లతో ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చినప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. సమావేశంలో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘ నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు, గ్లాస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top