వంద గంటల్లో 20 వేల మరుగుదొడ్ల నిర్మాణం


విజయనగరం కంటోన్మెంట్‌: వంద గంటల్లో 20 వేల మరుగుదొడ్లు నిర్మాణానికి వచ్చేనెల 10న  శ్రీకారం చుడతాం.. ఉద్యమ స్ఫూర్తితో నిర్మించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, డీఆర్డీఏ, డ్వామా, జెడ్పీ, పోలీస్, గనులు, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్జీఓలు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వంటి సంస్థల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రతి మండలానికి కనీసం రెండేసి గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. మార్చి పదో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించిన మరుగుదొడ్ల నిర్మాణాలు 14వ తేదీనాటికి పూర్తి కావాలన్నారు. దీని కోసం 19 విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. వాటికి అధికారులు, పర్యవేక్షణాధికారులను నియమించామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్‌డీఏ, జెడ్పీ నుంచి నాలుగు ప్రధాన శాఖల ముఖ్య అధికారులతో ఫిబ్రవరి 22న మోనిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నిర్మాణ ప్రణాళికను వివరించారు.



ఇదీ ప్రణాళిక..

ఈనెల 26న ప్రతి ఎంపీడీఓ వారి మండలాలకు సంబంధించిన కనీసం రెండు గ్రామాలను ఎంపిక చేయాలి. 28 నాటికి పంచాయతీ కార్యదర్శి, కంప్యూటర్‌ ఆపరేటర్, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సహాయంతో ప్రత్యేకాధికారులు కమ్మెన్స్‌మెంట్‌ లెటర్లు తయారు చేయాలి. పంచాయతీల ప్రత్యేకాధికారులు సంబంధిత సర్పంచ్, వీఓ ప్రెసిడెంట్‌ల సహాయంతో లబ్ధిదారులను, మెటీరియల్‌ సరఫరాదారులను గుర్తించాలి. 28 నాటికి తహసీల్దార్, ఎస్సైలు దగ్గరలోని ఇసుక రీచ్‌ల నుంచి అవసరమైన ఇసుకను సేకరించాలి. మరుగుదొడ్ల నిర్మాణాలకు అవసరమైన రుణ మొత్తాలను డీఆర్‌డీఏ పీడీ స్త్రీనిధి నుంచి ఆయా సంఘ సభ్యురాలికి ఏపీఎంల తరఫున అందించాలి. మార్చి4న మరుగుదొడ్లకు అవసరమైన రింగులు పూర్తి స్థాయిలో తయారు చేయించాలి.



  మార్చి ఆరున ఇటుక, సిమెంట్, తలుపు, వంటవి పూర్తి స్థాయిలో సేకరించి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యతను జేసీ–2, జెడ్పీ సీఈఓ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు తీసుకోవాలి. అనంతరం చెక్‌లిస్టులు సరిచేసుకోవడం, డాక్యుమెంటేషన్‌ వంటి కార్యక్రమాలను స్పెషల్‌ అధికారులు, యూనిసెఫ్‌ స్టేట్‌ వాష్‌ కన్సల్టెంట్‌ రవికాంత్‌ మజుందాలు చూసుకోవాలి. మార్చి 8 నాటికి డ్వామా పీడీ ఆధ్వర్యంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌ పనివారితో మార్కింగ్, పిట్టింగ్‌ వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలి. మార్చి 9 నాటికి మేస్త్రీ పనివార్ని సిద్ధం చేయడం, పది రోజుల పాటు నీటి సరఫరా, పనివారికి ఆహారం,



 వసతి కల్పనల వంటి కార్యక్రమాలను హౌసింగ్, క్రెడాయ్, కాంట్రాక్టర్ల అసోసియేషన్, జిల్లా కార్మిక శాఖాధికారి, మండల ప్రత్యేకాధికారులు, విజయనగరం, పార్వతీపురం పంచాయతీ అధికారులు పర్యవేక్షిస్తారు. రోజువారీ పనివేళల కంటే అధికంగా కార్మికులచే పనిచేయిస్తున్నందున వారికి చెల్లించాల్సిన వేతనాలను జిల్లా కార్మిక అధికారి, హౌసింగ్‌ పీడీలు నిర్ణయిస్తారు. మార్చి పదో తేదీ నుంచి వంద గంటల పాటు నిరంతరాయంగా సాగే మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని 24 గంటలూ మానిటరింగ్‌ చేసేందుకు జెడ్పీ కార్యాలయంలో 5 గురు అధికారులు సిద్ధంగా ఉంటారు. ఈ సెల్‌ మార్చి 9 నుంచి 15 వరకూ కొనసాగుతుంది. మార్చి పది నుంచి 12 వరకూ ఎఫ్‌టీఓలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ స్పెషల్‌ అధికారి,



ఎంపీడీఓలు పనిచేయాలి. మండల స్పెషలాఫీర్లు బాధ్యులుగా మార్చి పది ఉదయం ఆరు గంటల నుంచి మార్చి 13 రాత్రి పది గంటల వరకూ కొనసాగే ఈ మరుగుదొడ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఐటీడీఏ పీఓ, ఓఎస్‌డీ ఆపరేషన్స్‌ పర్యవేక్షిస్తారంటూ మరుగుదొడ్ల ప్రణాళికను వివరించారు. కార్యక్రమంలో జేసీ శ్రీకేశ్‌ బి.లఠ్కర్, ఐటీడీఏ పీఓ లక్ష్మీషా, ఓఎస్‌డీ అప్పలనాయుడు, జేసీ–2 యూసీజీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, పీడీలు ప్రశాంతి, ఢిల్లీ రావు, ఆర్డీఓలు ఎస్‌ శ్రీనివాసమూర్తి, ఆర్‌.గోవిందరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రమణమూర్తి, హౌసింగ్‌ పీడీ రమణమూర్తి, అన్ని మండలాల ప్రత్యేకా«ధికారులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top