నిరంతరం నిఘా

నిరంతరం నిఘా


రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్‌లో బ్లూకోట్స్ బృందాలు ప్రారంభం


కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కోసం బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కరీంనగర్ కమిషనరేట్‌కు కేటారుుంచిన 40 బ్లూకోట్స్ ద్విచక్ర వాహనాలను మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా తాను ఎక్కువ జీవోలు, ఎక్కువ నిధులు, సౌకర్యాలు కల్పించిన ఏకై క శాఖ పోలీస్‌శాఖనేనని తెలిపారు.



భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుంచి పెట్టబడులు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సింగపూర్ తరహా పోలీస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కరీంనగర్ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీ రవివర్మ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లూకోట్స్ ఏర్పాటుతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు.  



నేరాల నియంత్రణ : సీపీ కమలాసన్‌రెడ్డి

బ్లూ కోట్స్ బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బ్లూకోట్స్ బృందాల పనితీరు వివరిస్తూ..  నేరాల నియంత్రణ, ముందస్తు చర్యలు తీసుకోవడం, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 58 మంది కానిస్టేబుళ్లు, 58 మంది హోంగార్డులను కలిపి 40 బ్లూకోట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరు బ్లూ కలర్ రేడియం కోట్స్ ధరించి ప్రత్యేకంగా తయారు చేసిన బైక్‌లపై తిరుగుతూ పరిస్థితులను అదుపులో ఉంచుతారన్నారు. వీరి వెంట బైక్, వాటికి జీపీఎస్‌ట్రాకర్, వీడియో కెమెరా, టార్చిలైట్ ఉంటుందని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, గంగాధర, రామడుగు, చిగురుమామిడి, గన్నేరువరం, హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, కేశవపట్నం, ఇల్లందకుంట, వీణవంక పోలీస్‌స్టేషన్లలో వీరు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. డయల్ 100 కాల్స్‌కు సైతం స్పందించి సంఘటన ప్రాంతానికి పది నిమిషాల్లోపు చేరుకుంటారని తెలిపారు.



కరీంనగర్‌లో 20 షీటీం బృందాలను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకూ 43 మందికి కౌన్సిలింగ్ నిర్వహించగా నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా నేరాలకు పాల్పడని 43 మంది రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్ తొలగించామని కొత్తగా 53 మందిపై రౌడీషీట్స్, సస్పెక్ట్‌షీట్స్ తెరిచినట్లు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమరుు బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఎంపీపీ వాసాల రమేశ్, ఏసీపీలు రామారావు, రవీందర్‌రెడ్డి, సి.ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, బ్లూకోట్ సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top