కొలువు ఇష్టం లేకనేనా..?

కొలువు ఇష్టం లేకనేనా..? - Sakshi


కానిస్టేబుల్‌ ఆత్మహత్యతో పెద్దబండలో విషాదం

శోకసంద్రంలో తల్లిదండ్రి




నల్లగొండ క్రైం :

 అనారోగ్య సమస్యలకు మనస్తాపం చెందాడ.. ఉద్యోగం చేయడం ఇష్టం లేదా..లేక ఇంకేమైనా సమస్యలు వేధించాయా.. కారణాలైతే తెలియవు కానీ కానిస్టేబుల్‌ బలవన్మరణంతో జిల్లా కేంద్రంలోని పెద్ద బండలో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణంలోని పెద్దబండకు చెందిన మర్రి యాదయ్య, బుచ్చమ్మ దంపతులది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు, కూతురు సంతానం. యాదయ్య భవన నిర్మాణ కార్మికుడిగా, బుచ్చమ్మ పశువులను మేపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండో సంతానమైన శివరాజు (26) 2013లో నిర్వహించిన కానిస్టేబుల్‌ సెలక్షన్‌లో ఎం పికయ్యాడు. స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ కానీస్టేబు ల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.



మూడు నెలలుగా..

శివరాజు మూడు మాసాలుగా ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయితే కొంత కాలంగా ముభావంగా ఉంటున్న శివరాజు ఎవ్వరితో మాట్లాకుండా మనోవేదనతో బాధపడుతున్నాడని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.



ఇంటికొచ్చే సరికి..

రోజు వారీ పనిలో భాగంగా యాదయ్య తన పెద్దకుమారుడు నర్సింహతో కలిసి కూలి పనులకు వెళ్లారు. తల్లి బుచ్చమ్మ కూడా పశువులను మేపేందుకు ఉదయాన్నే వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి శివరాజు ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. నట్టింట్లో వేలాడుతున్న కుమారుడిని చూసి బుచ్చమ్మ బోరున విలపిస్తూ కుప్పకూలి పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన యాదయ్య కూడా వీగతజీవుడిగా మారిన కుమారుడిని చూసి తట్టుకోలేక పోయాడు. ఇంటికి ఆసరాగా ఉంటావనుకుంటే అఘయిత్యానికి ఒడిగట్టావా కొడుకా అంటూ పేద దంపతులు రోదించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది. సమాచారం మేరకు టూటౌన్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనారోగ్య కారణాలతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top