ప్రశాంతంగా కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్ష

ప్రశాంతంగా కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్ష - Sakshi

- 16754 మంది అభ్యర్థులు హాజరు

- 56 మంది గైర్హాజర్‌

- పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ

 

కర్నూలు(కొండారెడ్డి ఫోర్డు): పకడ్బందీ బందోబస్తు మధ్య పోలీసు కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16810 మందికి గాను 16754 మంది అభ్యర్థులు హాజరవ్వగా కేవలం 56 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షను నిర్వహించారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మొత్తం 622 సివిల్, ఏఆర్, జైలర్‌ వార్డెన్‌ పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్‌, దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన 16810 మందిని మెయిన్స్‌ పరీక్షకు అనుమతించారు. వీరి కోసం కర్నూలులో 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం పది నుంచి 1 గంట వరకు పరీక్షను నిర్వహించారు. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన అనుమతించమనే నిబంధనలు ఉండడంతో ఉదయం 8 గంటలకే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను హాల్‌ టిక్కెట్, ఆధార్‌కార్డుతోపాటు ఏదైనా గుర్తింపు కార్డును చూపిన వారిని కేంద్రాల్లోకి అనుమతించారు. మాల్‌ ప్రాక్టీస్‌ నివారణ కోసం బయోస్కానింగ్‌ విధానాన్ని అమలు చేశారు. ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద భారీ పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు.   

 

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

సుంకేసుల రోడ్డులోని సిస్టర్‌ స్టాన్సీలాస్, సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తనిఖీ చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను కోరారు. మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్‌ ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు. మరోవైపు పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షా కర్నూలు రీజియనల్‌ కోఆర్డినేటర్, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బీ.శ్రీనివాసరెడ్డి పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీలు డీవీ రమణమూర్తి, బాబుప్రసాదు పాల్గొన్నారు.    

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top