కూల్చివేతల వెనుక కుట్ర


  • వ్యాపార కేంద్రంగా నదీతీరం!  

  • రివర్‌ఫ్రంట్ కోసం విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసే యోచన

  • నేతల వ్యూహంతోనే ఆలయాల ధ్వంసం !  

  • పుష్కరాలను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా తొలగింపు

  •  

    విజయవాడ : విజయవాడ నగరంలో ఆలయాల అడ్డగోలు కూల్చివేత వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నదీతీర ప్రాంతాన్ని ధారాదత్తం చేసి వ్యాపార కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. విలాసవంతమైన రివర్ ఫ్రంట్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. నిత్యం వందలాదిమంది భక్తులు దర్శించుకునే ఆలయాలను రివర్‌ఫ్రంట్ కోసం కూల్చివేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన నాయకులు ముందస్తు వ్యూహంగా పుష్కరాల కోసం అభివృద్ధి పేరుతో తొలగించే కార్యక్రమం చేపట్టారని ప్రచారం జరుగుతోంది.

     

    సీఎం ఇంటి వైపు సాధ్యంకాక

    వాస్తవంగా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన గుంటూరు జిల్లా వైపు నదీతీరం అద్భుతంగా ఉంటుంది. అక్కడి ఆక్రమణలన్నింటినీ తొలగించి చక్కటి రివర్‌ఫ్రంట్‌గా మార్చుతామని గతంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అదే ప్రదేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని ఏర్పరుచుకోవటం, అక్కడి తీరప్రాంతమంతా బడాబాబుల గుప్పెట్లో ఉండటంతో ప్రస్తుతం అటువైపు రివర్ ఫ్రంట్ ఆలోచనకు స్వస్తి పలికినట్లు సమాచారం. తాజాగా ప్రకాశం బ్యారేజీ దిగువన రివర్‌ఫ్రంట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది.

     

    బ్యారేజీ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వద్ద రైల్వే బ్రిడ్జి వరకు సుమారు 800 మీటర్లు ఉంటుందని, 35 నుంచి 40 అడుగుల వెడల్పు స్థలం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిలో ఏడాదంతా నీరు ఉండేందుకు ఒక చెక్‌డ్యామ్‌ను నిర్మించి, అందులో సుమారు ఆరేడు అడుగుల నీరు సంవత్సరమంతా ఉండే విధంగా మార్చితే అక్కడ రివర్ ఫ్రంట్, నదిలో బోటింగ్ ఏర్పాటుకు అనేక విదేశీ సంస్థలు ముందుకు వస్తాయని నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది.  అందులో భాగంగానే పుష్కరాలను అడ్డుపెట్టుకుని సాయిబాబా గుడి,  శనైశ్చర ఆలయం, భూగర్భ వినాయకుడు తదితర దేవాలయాల ధ్వంసానికి సిద్ధమయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top