ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి


ఒంగోలు : రైతుల సంఖ్య తగ్గితేనే లాభాలు ఆర్జించడం సాధ్యపడుతుందని, రైతులు ఇతర రంగాలవైపు దృష్టి సారించాలని ఉద్యానశాఖ రాష్ట్ర కమిషనర్‌ చిరంజీవి చౌదరి అన్నారు. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో బుధవారం నిర్వహించిన ఉద్యానవన శాఖ రైతుల శిక్షణ  కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ఉద్యానవన రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పొలాల్లో పంట సంజీవనులు  నిర్మించుకోవాలన్నారు. వాటిని నిర్మించుకోవడంతోపాటు డ్రిప్‌ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల ద్వారా ఆ నీటిని వినియోగించుకుంటే రైతులు నీటి సమస్య నుంచి గట్టెక్కుతారన్నారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు కలిసి నూతన ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు ముందుకు రావాలన్నారు.


ఈ పద్ధతి వల్ల పంటకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ అన్నింటినీ అందరూ కలిసి కొనుగోలుచేయడం, మార్కెటింగ్‌ చేయడం, రవాణా తదితర అంశాల్లో అనుభవాలు పంచుకోవడం ద్వారా తక్కువ వ్యయంతో సాగు సాధ్యమవుతుందన్నారు.  ఈ సందర్భంగా  పలువురు రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం నీటిని సాగర్‌ ద్వారా విడుదల చేస్తుందని, అయితే ఉద్యానవన పంటల రైతులు మోటార్ల ద్వారా నీటిని పెట్టుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులు అంగీకరించడం లేదన్నారు. దీనివల్ల జిల్లాలోని సాగర్‌ కాలువల వెంబడి ఉన్న తాము తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామన్నారు.  చీని పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. దీనిపై కమిషనర్‌ వివరణ ఇస్తూ చీనిపంటలకు బీమా సౌకర్యం కల్పించామని, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే ఉద్యానవన రైతులు కూడా నష్టపోకుండా  కలెక్టర్‌ తదితరులతో మాట్లాడి రైతులకు అండగా నిలవాలని సూచించారు. రైతుల సంఖ్య తగ్గితేనే ఉన్న రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిస్తూ పటిష్టమైన ప్రణాళిక ద్వారా లాభాలు గడించడం సాధ్యమవుతుందన్నారు.  కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు హరిప్రసాద్, జెన్నమ్మ, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.బాపిరెడ్డి, డ్వామా పీడీ పోలప్ప, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సత్యన్నారాయణ, ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిపాలనాసంఘం సభ్యుడు నూకసాని బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top