కరువుపై అసెంబ్లీలో చర్చ జరగాలి

కరువుపై అసెంబ్లీలో చర్చ జరగాలి - Sakshi


- కరువు– చంద్రబాబు అవిభక్త కవలలు

- ఉగాది తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు

- ‘కరువుపై సామూహిక సత్యాగ్రహం’లో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి




అనంతపురం సెంట్రల్‌ : అసెంబ్లీ సమావేశాల్లో కరువుపై చర్చించి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉగాది తర్వాత గ్రామగ్రామానా తిరిగి ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి హెచ్చరించారు. కరువు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివక్త కవలలు అని అన్నారు. శనివారం నగరంలో కేఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా ‘కరువుపై సామూహిక సత్యాగ్రహం’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పీసీసీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువును ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా చతికిల పడ్డారన్నారు. 2014–15 సంవత్సరానికి సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ కూడా చెల్లించలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నారన్నారు.  ఉపాధిహామీ పథకం నీరుగారిపోయిందన్నారు.



అధికారంలోకి వస్తే రూ.10 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, నాలుగేళ్ల కాలానికి ఎకరాకు రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో  రెయిన్‌గన్‌ల ద్వారా పంటలను కాపాడినట్లు సీఎం గొప్పలు చెప్పారని, ఇక్కడికొచ్చి చూశాక చంద్రబాబు శుద్ధ అబద్ధాల కోరు అని అర్థమైందన్నారు. సీఎం సొంత బామ్మర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోనే నీటి సమస్య తీవ్రంగా ఉండడం బాధాకరమన్నారు.



ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లామన్నారు.పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును జాతీయ సమస్యగా సృష్టించినా అప్పట్లో వెనక్కి తగ్గలేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి, అసెంబ్లీ  మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శైలజానాథ్, కొండ్రుమురళీ, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్‌వలీ, మల్లాది విష్ణు, సుధాకర్, నాగరాజరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ అధికారప్రతినిధులు రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top