హోరు గర్జన

హోరు గర్జన - Sakshi


సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ప్రజాగర్జన

భారీగా తరలివచ్చిన పార్టీశ్రేణులు

లింగంపల్లి నుంచి సభాస్థలి వరకు..

రాహుల్‌కు అడుగడుగునా నీరా‘జనం’


సాక్షి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగర్జనకు రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో సంగారెడ్డి పట్టణం జనసంద్రంగా మారింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణులు అడుగడుగునా స్వాగతం పలికాయి. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు సుమారు పది రోజులుగా సభ ఏర్పాట్లలో నిమగ్నం కాగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంతా తానై వ్యవహరించారు.



జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి తదితర కీలక నేతలు సభకు హాజరైనా రాహుల్‌ దృష్టిని ఆకర్షించేందుకు జగ్గారెడ్డి చేసిన ప్రయత్నం సఫలమైనట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మెదక్‌ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీలో చేరి.. ఆ తర్వాత పార్టీలోకి తిరిగి వచ్చిన జగ్గారెడ్డి.. పార్టీలో తిరిగి తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ సభ ఉపయోగపడినట్లుగా భావిస్తున్నారు. వారం రోజులుగా సంగారెడ్డికి వచ్చి సభ ఏర్పాట్లను పరిశీలించిన ఏఐసీసీ బాధ్యులు ఆర్సీ కుంతియా, దిగ్విజయ్‌ సింగ్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తదితరులు జగ్గారెడ్డిని తరచూ పొగడ్తలతో  ముంచాయి.



 గురువారం జరిగిన ప్రజాగర్జన సభలోనూ జగ్గారెడ్డిని రాహుల్‌ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు.. రాహుల్‌ ప్రసంగం ముగిసేంత వరకు పక్కనే నిల్చున్నారు. సుమారు మూడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు చాలా కాలం తర్వాత ఒకే వేదిక మీదకు రావడం.. ప్రజాగర్జన సభలో కనిపించింది. జగ్గారెడ్డితో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి సభలో ప్రసంగించే అవకాశం లభించింది. ప్రజాగర్జన సభకు జన సమీకరణపై అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో భారీగా కార్యకర్తలు తరలిరావడం పార్టీ నేతల్లో కొంత ఆత్మ విశ్వాసం పెంచినట్లు కనిపించింది.



పట్టణంలో జన జాతర..

సభా ప్రాంగణం అంబేడ్కర్‌ మైదానంలో జనం కిక్కిరిసి పోవడంతో.. సభా ప్రాంగణం వెనుక భాగంలో ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి.. కుర్చీలు వేశారు. ఐబీ గెస్ట్‌హౌస్, పాత బస్టాండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరలపై సభను వీక్షించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండు వరకు సభ కోసం వచ్చిన వారితో రోడ్లు కిక్కిరిసి పోయాయి. సభా ప్రాంగణానికి దారి తీసే మార్గంలో పోలీసులు తొక్కిసలాట జరగకుండా పలుమార్లు చెదరగొట్టాల్సి వచ్చింది. పార్కింగ్‌కోసం ఏర్పాటు చేసిన స్థలం కొన్ని చోట్ల దూరంగా ఉండంతో సభకు వచ్చిన జనం రోడ్డు పక్కనే వాహనాలు నిలిపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.



 కాగా జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాహుల్‌కు కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నేతలు అడుగడుగునా స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. రాహుల్‌ రాక సందర్భంగా లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు ముంబై జాతీయ రహదారి పొడవునా పార్టీ పతాకాలు, ఫ్లెక్సీలు, నాయకుల కటౌట్లతో అలంకరించారు. లింగంపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్‌కు అమీన్‌పూర్‌ సర్పంచ్‌ కాటా శ్రీనివాస్‌ గౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు సుధారాణి స్వాగతం పలికి.. పగిడీ పెట్టారు. పటాన్‌చెరులో కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌ నేతృత్వంలో రాహుల్‌కు స్వాగతం పలికారు. ఎస్‌పీజీ బలగాల పర్యవేక్షణలో వచ్చిన రాహుల్‌ను కలిసేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వేదికపై సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు తోపాజీ అనంతకిషన్, సాబేర్‌ రాహుల్‌ను సన్మానించారు.



కేసీఆర్‌కు ఇక నిద్ర పట్టదు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రజా గర్జన సభ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్రపట్టదని మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. “అంబేడ్కర్‌ స్టేడియానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1979లో ఇక్కడ జరిగిన బహిరంగ సభలో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ పాల్గొన్నారు. 1980లో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి.. కేంద్రంలో అధికారంలోకి వచ్చారు.’ అని జగ్గారెడ్డి గతాన్ని గుర్తు చేశారు. 40ఏళ్ల తర్వాత ఇందిరా గాంధీ మనవడు అదే మైదానం నుంచి ప్రసంగిస్తున్నాడని.. 2019లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.



యువరాజు, రారాజు రాహుల్‌ సంగారెడ్డికి రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయన్నారు. “టీఆర్‌ఎస్‌ నాయకులకు భయపడకండి.. దాడులకు ప్రతిదాడులు తప్పవు. కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికొస్తే అంతుచూస్తాం’అని హెచ్చరించారు. పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరగబడాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. “కేసీఆర్‌ కుటుంబ పాలన పతనం ఖాయం.. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరుతుందని’ జగ్గారెడ్డి ప్రసంగించారు.


‘‘తెలంగాణలో ఇంటింటికీ తిరగండి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో బాధ పడుతున్నవారిని కలవండి.’’

– కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌గాంధీ పిలుపు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top