అది రాబందుల యాత్ర

అది రాబందుల యాత్ర - Sakshi


కాంగ్రెస్ నేతల రైతు భరోసా యాత్రపై కేటీఆర్

నేటి రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించొద్దని విజ్ఞప్తి


 

 మెదక్: రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర చేపడుతున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోగానే కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ రైతు భరోసా యాత్రలంటూ రాబందుల యాత్ర మొదలుపెట్టారని దుయ్యబట్టారు. శుక్రవారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు శనివారం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశాయన్నారు.



ఇప్పుడు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలలే అయిందని, రైతు రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేయాలంటే ఎలా కుదురుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణాలను 4 విడతల్లో వడ్డీతో సహా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.8,500 కోట్లను బ్యాంకర్లకు చెల్లించిందని, దీనివల్ల రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ఆయన వివరించారు. వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది గత పాలకులేనని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వాలు మరిచిపోయాయన్నారు.



తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్లు వెచ్చిస్తోందని కేటీఆర్ తెలిపారు. పంటల బీమా చెల్లించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్న కేటీఆర్.. ఈ విషయంపై రైతు యూనిట్‌గా పంటల బీమాను వర్తింపజేయాలని కేంద్రానికి గతంలోనే చెప్పామన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు దమ్ముంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని  సవాల్ విసిరారు.



నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని కాదా? అని  ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటించి, తెలంగాణను విస్మరించినా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని ప్రతిపక్షాలు రైతు భరోసా యాత్ర పేరుతో ఏకమై ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటే గత ప్రభుత్వం రూ.1.5లక్షలు మాత్రమే ఇవ్వగా, దాన్ని సీఎం కేసీఆర్ రూ.6 లక్షలకు పెంచారని కేటీఆర్ గుర్తుచేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top