రెండేళ్లా.. ఏడేళ్లా?

రెండేళ్లా.. ఏడేళ్లా? - Sakshi


 రెండేళ్లలో పూర్తి చేస్తాం.. ముఖ్యమంత్రి మాట!

 

 నాలుగేళ్లలో పూర్తవుతుంది.. ప్రభుత్వ ఉత్తర్వు!

 

 ఏడేళ్ల సమయం పడుతుంది.. ప్రపంచబ్యాంకుకు నివేదిక!!

 పాలమూరు ప్రాజెక్టు పూర్తిపై ఏమాట నిజం?

 

- రెండేళ్లలో పూర్తి చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం

- తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో నాలుగేళ్లు

- ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఏడేళ్లు

- ప్రభుత్వ ప్రకటనలపై అంతా అయోమయం

- పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే

- 7 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం

- అయినా వాటిపై మౌనముద్ర

 

సాక్షి, హైదరాబాద్:
పది లక్షల ఎకరాలకు సాగునీరు.. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తవుతుందన్న అంశంపై ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలు చేస్తోంది. రూ.35,200 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఒక మాట, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మరో మాట, ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఇంకో విషయం ఉండడంతో ఏది నిజమో తెలియక అటు అధికారులు, ఇటు పాలమూరు నేతలు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికిపైగా పూర్తయి ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే నాలుగు ప్రాజెక్టుల పూర్తిపై మౌనం దాల్చి.. కొత్తగా పాలమూరు ప్రాజెక్టును అందలమెక్కించడంపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



ఒక్కోమారు ఒక్కోలా...

పాలమూరుపై ప్రభుత్వం ఒక్కో వేదికపై ఒక్కోలా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు సత్వర పూర్తికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తూ ఈ నెల ఒకటిన ఇచ్చిన జీవో 143లో 48 నెలల(నాలుగేళ్లు) కాలంలో పూర్తి చేయాలని నీటి పారుదల శాఖకు సీఎం మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే ప్రాజెక్టుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ లెక్కన ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఏటా రూ.9 వేల కోట్ల మేర ఖర్చు చేయాలి. శనివారం ప్రాజెక్టుపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు.



అంటే ఏటా రూ.18 వేల కోట్లు కేటాయించాలి. ఇప్పటికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి(జూన్ 11) మూడు నెలలు గడుస్తున్నా.. పూర్తిస్థాయి సర్వేనే పూర్తికాలేదు. అలాంటిది ప్రాజెక్టును రెండే ళ్లలో పూర్తి చేయడం ఎలా సాధ్యమని నీటి పారుదల రంగ నిపుణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం నిర్మాణంలో 25 ప్రాజెక్టులతో పాటు, కొత్తగా చేపడుతున్న పాలమూరు, నక్కలగండి తదితర పథకాలకు కలిపి మొత్తంగా రూ.1,03,051 కోట్ల అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం నెల రోజుల కిందట ప్రపంచబ్యాంకుకు తెలిపింది.



ఇందులో కొత్తగా చేపడుతున్న పాలమూరుకు రూ.35,200 కోట్లు అంచనా వే సింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.13,400 కోట్లు, తర్వాతి మూడేళ్లలో 2021-22 నాటికి మరో రూ.21,800 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. అంటే ఈ ప్రభుత్వ గడువు ముగిసే నాటికి(2018-19) పాలమూరులో కేవలం మూడో వంతు పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా పొంతనలేకుండా చేస్తున్న ప్రకటనల్లో దీనిలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొంది.



పాత ప్రాజెక్టుల సంగతేంటీ?

పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. అయితే అపరిషృ్కతంగా ఉన్న భూసేకరణ, పునరావాసం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ఏడాదిన్నరగా ముందుకు కదల్లేదు. దీంతో ఆయకట్టు లక్ష్యాలు ఏడాదికేడాది తగ్గుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తంగా 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ నాటికే 3 లక్షలకు పైగా ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయంచినా సాధ్యం కాలేదు. రైల్వే, రహాదారుల క్రాసింగ్ సమస్య, ఎస్కేలషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం తేల్చకపోవడం వంటి అంశాలూ గుదిబండగా మారాయి.



దీంతో ప్రస్తుత బడ్జెట్‌లో రూ.660 కోట్ల మేర కేటాయింపులు జరిపినా ఇప్పటివరకు రూ.20 కోట్ల మేర కూడా ఖర్చు జరుగలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుల కింద.. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని చెబుతున్నారు. కేవలం వెయ్యి కోట్ల మేర ఖర్చు చేస్తే 7 లక్షల ఆయకట్టును ఇచ్చే ప్రాజెక్టులపై మౌనం దాల్చి.. కొత్త ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఆయకట్టుకు నీరిస్తామనడంలో ఆతర్యమేమిటో అర్థంగాక పాలమూరు రైతులు తలలు పట్టుకుంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top