సూత్రధారి తేలితేనే తప్పనున్న శిక్ష!

సూత్రధారి తేలితేనే తప్పనున్న శిక్ష!


⇒ దుబాయ్‌లో మందుల మాఫియా కేసులో..

⇒ అయోమయంలో శ్రీనివాస్‌

⇒ చివరి అప్పీలుకు అవకాశమిచ్చిన కోర్టు

⇒ ఇక పాత్ర సీబీసీఐడీదే..


మోర్తాడ్‌(బాల్కొండ):

గల్ఫ్‌ దేశాల్లో నిషేధించిన మందులను రవాణా చేస్తూ దుబాయ్‌ ఏయిర్‌ పోర్టులో పట్టుబడిన తడపాకల్‌వాసి పూసల శ్రీనివాస్‌కు విధించిన శిక్షను రద్దు చేసేందుకు అక్కడి కోర్టు ఓ అవకాశాన్ని కల్పించింది. మందుల మాఫియా అసలు సూత్రధారిని గుర్తించి అతడిపై కేసు నమోదు చేసి పత్రాలను తమకు సమర్పిస్తే శ్రీనివాస్‌కు క్షమాభిక్షను ప్రసాదిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో బాధితుడు విడుదలయ్యేందుకు మార్గం ఏర్పడింది.


దుబాయ్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శ్రీనివాస్‌ సెలవుపై ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుని సెప్టెంబర్‌ 2016లో తిరిగి దుబాయ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో మందుల మాఫియా ఒక పార్శిల్‌ను శ్రీనివాస్‌కు ఇవ్వగా దుబాయ్‌ ఏయిర్‌పోర్టులో అక్కడి పోలీసుల తనిఖీల్లో బాధితుడు దొరికాడు. అయితే ఈ మందులతో తనకు సంబంధం లేదని, తనకు విమాన టిక్కెట్‌ ఇచ్చిన వ్యక్తి పార్శిల్‌ ఇచ్చాడని మానవతా థృక్పథంతో పార్శిల్‌ను దుబాయ్‌కి తెచ్చానని శ్రీనివాస్‌ మొరపెట్టుకున్నాడు.


శ్రీనివాస్‌ పట్టుబడ్డాక దుబాయ్‌లో పార్శిల్‌ తీసుకోవాల్సిన వ్యక్తి రాకపోవడంతో శ్రీనివాస్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త శ్రీనివాస్‌ అరెస్టుతో బాధితుడి భార్య లతిక మన దేశం నుంచి న్యాయ పోరాటం ఆరంభించింది. మందుల మాఫియా పన్నిన వలలో అమాయకులు అరెస్టు అవుతున్నారని శ్రీనివాస్‌ భార్య లతిక ఆరోపిస్తూ పోలీసులకు, ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు ఫిర్యాదు చేసింది.


కాగా ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. సీబీసీఐడీ దర్యాప్తు ఆరంభించగా మందుల మాఫియాతో సంబంధం ఉన్నవారిని గుర్తించి విచారించింది. సీబీసీఐడీ అధికారులు పలుమార్లు బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి నిందితుల వివరాలను సేకరించారు. అయినా ఈ కేసును సీబీసీఐడీ ఒక కొలిక్కి తేలేక పోయింది.


బాధితుడికి ఏడేళ్ల జైలు శిక్ష..

మరోవైపు దుబాయ్‌ ఔట్‌ జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న శ్రీనివాస్‌ కేసును విచారించిన కోర్టు నిషేధిత మందులను తెచ్చినందుకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు ఇండియా కరెన్సీలో రూ.9 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరిన్ని నెలలపాటు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే బాధితుడు శ్రీనివాస్‌ తరపున గల్ఫ్‌ రిటర్నింగ్‌ మెంబర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ చాంద్‌పాషా న్యాయపోరాటం చేస్తున్నారు.


అతడితోపాటు గల్ఫ్‌ తెలంగాణ కల్చరల్‌ అసోషియేషన్‌ అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డి, సంస్థ సభ్యుడు అనిల్‌యాదవ్‌ కూడా శ్రీనివాస్‌ను విడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనిల్‌యాదవ్‌ ఒక అడుగు ముందుకేసి దుబాయ్‌కు విజిట్‌ వీసాపై వెళ్లి శ్రీనివాస్‌ను అక్కడి జైళ్లో కలిసాడు.


తనకు దుబాయ్‌ కోర్టు క్షమాభిక్ష పెట్టేందుకు అవకాశం కల్పించిందని అయితే ఇండియా నుంచి మందుల సూత్రధారిపై కేసు నమోదైనట్లు పత్రాలు కోర్టు ద్వారా ఇండియన్‌ ఎంబసీకి వస్తే దుబాయ్‌ కోర్టులో సమర్పించి తనకు విముక్తి కల్పించవచ్చని శ్రీనివాస్‌కు అనిల్‌ యాదవ్‌తో స్పష్టం చేశాడు. మందుల మాఫియా కేసులో సీబీసీఐడీ కేసు పత్రాలను దుబాయ్‌లోని మన ఎంబసీకి పంపించాలి. దుబాయ్‌లోని మన ఎంబసీ అధికారులు మే 3లోగా కోర్టుకు శ్రీనివాస్‌కు సంబంధిత పత్రాలు సమర్పిస్తే బాధితుడికి శిక్ష నుంచి విముక్తి లభించనుంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top