జీజీహెచ్‌కు, డాక్టర్‌కు ఫోరం వడ్డింపు


  •   

  • చికిత్స సరిగా చేయలేదని ఆశ్రయించిన ఫిర్యాదుదారుకు 

  • రూ.4 లక్షల 7వేలు చెల్లించాలని తీర్పు

  •  

    గుంటూరు లీగల్‌: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి,  వైద్యుడు  కలసి ఫిర్యాదుదారుకు రూ. 4లక్షల 7వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు.... గుంటూరు నగరంలోని  కొరిటెపాడుకు చెందిన తులసి శివనాగేశ్వరరావు పత్తి వ్యాపారం చేస్తుంటారు. శివనాగేశ్వరరావు 2010 సెప్టెంబర్‌ 2న గుడివాడలో రాత్రి 10గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలు ఎముకలు విరగటంతో బంధువులు 3వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.   అదే నెల 14న డాక్టర్‌ ఎం. ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ చేసి రాడ్‌లు అమర్చారు. చికిత్స అనంతరం నవంబర్‌ 14న శివనాగేశ్వరరావును డిశ్చార్జి చేశారు.   ఆరు నెలలు గడచినప్పటికీ నొప్పి తగ్గక పోవడం, కాలు  వాపు వస్తుండటంతో తిరిగి ప్రభుత్వ సమగ్ర అస్పత్రికి రాగా 2011 మే 26న తిరిగి ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చి  జూన్‌ 9న డిశ్చార్జి చేశారు. అయినా సమస్య తగ్గక పోగా ఆయన  పక్షవాతానికి గురయ్యారు. దీంతో 2011అక్టోబర్‌ 24న ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యుడు పరిశీలించి రాడ్స్‌ సరిగా అమర్చలేదని,  అందుకే సమస్య వచ్చిందని ఆపరేషన్‌ చేసి అవి సరిచేయాలని చెప్పి మరలా  ఆపరేషన్‌ నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐలో  ఆపరేషన్‌ చేసినా ఫలితం లేక పోవడంతో మరో ఎముకల డాక్టర్‌ను  సంప్రదించారు. ఆయన కూడా రాడ్స్‌ సరిగా అమర్చనందున సమస్య ఏర్పడిందని మరలా ఆపరేషన్‌ చేయాలని తెలిపారు. అప్పటికే శివనాగేశ్వరరావుకు సుమారు రూ.90వేలు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కాలు సరికాలేదని ఆరోపిస్తూ, ఈ కాలంలో తాను  ఆదాయం కూడా కోల్పోయానని పేర్కొంటూ జిల్లా వినియోగ దారుల ఫోరంను ఆశ్రయించారు.  కేసు పూర్వాపరాలు పరిశీలించి...ఫిర్యాదు దారు ఆదాయం నష్టపోయినందుకు రూ. 3లక్షలు, మానసిక వేదనకు రూ. లక్ష, వివిధ ఖర్చుల కింద మరో రూ. 7వేలు ఆరువారాలలో చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు బి. రామారావు, సభ్యులు ఎ. ప్రభాకర గుప్త, టి. సునీతలతో కూడిన బెంచి తీర్పు చెప్పింది.  

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top