‘స్మార్ట్’గా ఫిర్యాదు చేయవచ్చు..

‘స్మార్ట్’గా ఫిర్యాదు చేయవచ్చు.. - Sakshi

  • పోలీసు ‘అభయం’ యాప్‌కు ఆధునిక హంగులు

  • ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లో ఘటనా స్థలానికి

  • రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు

  • సాక్షి, హైదరాబాద్: పోలీసు సహాయం కావాల్సినా, ఫిర్యాదు చేయాలన్నా ఇకపై పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కోణంలో ఇప్పటికే ‘ఐ క్లిక్’ పేరుతో ఎఫ్‌ఐఆర్ కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్న పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం మహిళల భద్రత కోసం విశాఖపట్నంలో మాత్రమే అమలులో ఉన్న ‘అభయం’ మొబైల్ యాప్‌కు ఆధునిక హంగులు అద్దుతోంది. అందరికీ ఉపయుక్తంగా ఉండేలా రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి పోలీసు సాంకేతిక సేవల విభాగం సన్నాహాలు చేస్తోంది.

     

    ప్లేస్టోర్‌లో లభించే ఈ అప్లికేషన్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని, నిర్దేశించిన బటన్ నొక్కితే ఆ ఫిర్యాదు సంబంధిత పోలీసు స్టేషన్‌కు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంటర్‌నెట్ సౌకర్యంతో సంబంధం లేకుండా పని చేసేలా ఈ యాప్ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్), గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరిజ్ఞానాల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ బాధితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని గుర్తించి కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత స్టేషన్‌కు చేరవేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం గరిష్టంగా ఐదు నిమిషాల్లో పూర్తయ్యే విధంగా యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

     

     రాజమండ్రి అర్బన్ పోలీసు జిల్లాలో అమలులోకి తెచ్చిన ‘రక్షిత’, విశాఖపట్నంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ‘అభయం’ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ‘అభయం’ యాప్‌ను అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దీనిపై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ కార్యాలయం పోలీసు సాంకేతిక సేవల విభాగాన్ని ఆదేశించింది. బాధితులకు సమస్య వచ్చినప్పుడు పోలీసు స్పందించే ‘రెస్పాన్స్ టైమ్’ సాధ్యమైనంత తక్కువ చేయడం కోసం ఈ తరహా వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top