భూ బాగోతాలపై కలెక్టర్‌ సీరియస్‌

భూ బాగోతాలపై కలెక్టర్‌  సీరియస్‌ - Sakshi

  • విచారణకు ఆదేశం

  • నలుగురు డిప్యూటీ కలెక్టర్ల నియామకం

  • రెండు రోజుల్లో విచారణ ప్రారంభం

  •  అధికారులు, అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు

  • అసెంబ్లీలో ప్రస్తావనకు వైఎస్సార్‌సీపీ సిద్ధం

  •  

    నక్కపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల వెలుగుచూసిన భూ బాగోతాలపై  జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది.  ప్రభుత్వ మిగులు భూములకు పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు తారుమారుచేసి ఒన్‌ బీల్లో నమోదు చేయడంపై కలెక్టర్‌ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ బాగోతాల వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.  ప్రత్యేకంగా నలుగురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను నియమించి భూ అక్రమాలపై నివేదిక సమర్పించాలని  ఆదేశించారు. దీంతో అక్రమాలకు పాల్పడిన వారి గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

    నక్కపల్లి:  విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు ప్రభుత్వం భూమి సేకరిస్తుండటంతో కొంతమంది టీడీపీ నాయకులు   అధికారులతో చేతులు కలిపి అక్రమంగా పరిహారం పొందేందుకు ఎత్తుగడలు వేశారు. ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు ఇచ్చినట్లు ఒన్‌బీల్లో నమోదు చేయించి  పరిహారం కాజేసేందుకు  ఎత్తుగడలు వేశారు. సుమారు రూ.30 కోట్లు విలువైన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారు. రాజయ్యపేటలో 19 ఎకరాలు, అమలాపురంలో 70 ఎకరాలు, నెల్లిపూడిలో 20 ఎకరాలు ఇలా రికార్డులు తారుమారు చేసి పరిహారం కాజేసేందుకు కుట్రపన్నారు.  అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం కాని, డీ ఫారం పట్టాలు గాని  జారీచేయని భూములకు నిబంధనలకు విరుద్ధంగా అడంగల్, ఒన్‌బీల్లో మార్పుచేసి ఖాతానెంబర్లు ఇచ్చి ఆన్‌లైన్‌ చేశారు. రాజయ్యపేటలో రామాలయానికి చెందిన సుమారు  19 ఎకరాలు జిరాయితీ భూమికి బినామీ వారసుడిని తెరమీదకు తెచ్చి  అతని చేత నష్టపరిహారానికి క్లెయిం చేయించి సుమారు రూ. 4 కోట్ల   పరిహారం కాజేసేందుకు స్కెచ్‌ వేశారు. 

    సాక్షి కథనాలతో పరిహారం మంజూరుకు బ్రేక్‌

    అడంగల్‌లో సాగుదారులు పేర్లు నమోదు చేయకుండా పరిహారం  స్వాహా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో పరిహారం మంజూరుకు బ్రేక్‌ పడింది.  అమలాపురం, నెల్లిపూడిలలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా సుమారు 70 ఎకరాలకు  పట్టాలు ఇచ్చినట్లు ఆన్‌లైన్‌ చేశారు.  ఈ మూడు గ్రామాల్లో జరిగిన భూబాగోతాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి.    మండలంలో కొంతమంది పచ్చనేతల అండతో చేస్తున్న ఈ బాగోతాలను అధికారపార్టీలోనే  కొంతమంది అసమ్మతినేతలు పార్టీ అధిష్టానానికి పత్రికా క్లిప్పింగులతో సహా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీకి చెడ్డపేరు రావడంతోపాటు, ప్రతిపక్ష పార్టీ ఈ వ్యవహారాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడానికి రంగం సిద్ధం చేస్తోందన్న సమాచారం టీడీపీ అధిష్టానం దష్టికి వెళ్లింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి అప్రతిష్ట వస్తుందని   కొందరు అసమ్మతి నేతలు పార్టీకి వివరించినట్లు సమాచారం. వైఎస్సార్‌ సీపీ నేతలు మాత్రం అన్ని ఆధారాలు సేకరించి నివేదిక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేయడానికి సిద్ధపడుతున్నారు.

    త్వరలో విచారణ ప్రారంభం

       ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు  చేపట్టిన ప్రవీణ్‌ కుమార్‌ ఈ భూ బాగోతాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించడంతో వారు పుష్కరాల ముగిసిన అనంతరం ఈ  వ్యవహారంపై గ్రామాల్లో విచారణ ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బాగోతాల్లో ముఖ్యంగా వీఆర్వోలు, కొందరు మండల స్థాయి అధికారులు కీలక పాత్ర పోషించారు.    విచారణ పారదర్శకంగా జరిగితే  ఈ బాగోతం చాలామంది మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top