‘అల్లోల’ Vs ఇలంబరిది

‘అల్లోల’ Vs  ఇలంబరిది - Sakshi


నిర్మల్‌లో మంత్రి, కలెక్టర్‌ మధ్య కోల్డ్‌వార్‌

కలెక్టర్‌ తీరుపై    మంత్రి గుర్రు

పలు సమావేశాల్లో∙బయటపడుతున్న అంతరం

కలెక్టర్‌ను కాదని.. మరో జిల్లా అధికారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రచారం

కలెక్టరేట్, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర అంశాల్లో పెరిగిన దూరం




మంచిర్యాల: నూతన జిల్లా నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి), కలెక్టర్‌ ఇలంబరిది మధ్య అగాధం పెరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన గృహ నిర్మాణం, దేవాదాయ, న్యాయ శాఖలను పర్యవేక్షిస్తున్న ఐకే రెడ్డి జిల్లా కలెక్టర్‌ ఇలంబరిది తీరుపై అసంతృప్తితో ఉన్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి, ఆ జిల్లా మంత్రికి కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగం కొంత అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో కూడా మంత్రి మాటకే ప్రాధాన్యత ఇస్తారు. నిర్మల్‌ జిల్లాలో     అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆరోపణ. దాంతో జిల్లాగా ఏర్పాటైన కొద్ది రోజుల నుంచే మంత్రి, కలెక్టర్‌ మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది . రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్‌ ఇలంబరిది కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పాలకపక్షం బాహాటంగానే విమర్శిస్తోంది. మంత్రి తనకు కాకుండా కింది అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని కలెక్టర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కలెక్టర్‌ కూడా తన వద్దకు వచ్చే రెవెన్యూ, ఇతర ముఖ్యమైన ఫైళ్లను జాయింట్‌ కలెక్టర్‌కే పంపిస్తున్నట్లు సమాచారం. కొత్త జిల్లాకు చుక్కానిలా ముందుండి నడిపించాల్సిన మంత్రి, కలెక్టర్‌ల మధ్య సాగుతున్న కోల్డ్‌వార్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది.



డబుల్‌బెడ్‌ రూం ఇళ్లలో వెనుకబాటు... కలెక్టరేట్‌ స్థలంపై వివాదం

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి తొలివిడతలో 450, రెండో విడతలో 1000 చొప్పున డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. కానీ జిల్లా వ్యాప్తంగా మంత్రి స్వగ్రామంలోని ఎల్లపెల్లిలో 45 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. కలెక్టర్‌ చొరవ తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పక్క జిల్లాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు నిర్మల్‌లో ఎందుకు రారనేది మంత్రి అనుయాయుల వాదన. మంత్రి ఐకే రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అలాగే జిల్లా కలెక్టరేట్‌ కోసం స్థలాన్ని ఎంపిక చేసే విషయంలో చెలరేగిన వివాదం కూడా మంత్రి, కలెక్టర్‌ల మధ్య అగాధానికి కారణంగా భావిస్తున్నారు.



నిర్మల్‌ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని భీమన్నగుట్ట వద్ద తొలుత స్థలం ఎంపిక జరిగింది. ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. భీమన్న గుట్టలో కలెక్టరేట్‌ను వ్యతిరేకిస్తూ జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మంత్రి సొంత గ్రామం ఎల్లపెల్లికి సమీపంలో ఆయన భూములకు ధరలు పెంచేందుకే భీమన్నగుట్టలో కలెక్టరేట్‌ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయా పార్టీల నాయకులు విమర్శలు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ సరిగా స్పందించలేదని మంత్రి ఐకే రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.



అధికార పార్టీపై మొగ్గు లేదా..?

సబ్సిడీతో మంజూరు చేసే వ్యవసాయ ట్రాక్టర్ల జాబితా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తులకే చోటు దక్కుతుందనే విమర్శలున్నాయి. కానీ నిర్మల్‌లో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో కలెక్టర్‌ తనదైన రీతిలో వ్యవహరించారని, మంత్రి సూచించిన పేర్లను పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. అదే విధంగా జిల్లా కేంద్రలోని ఏరియా ఆసుపత్రిలో నూతన ఐసీయూకు మంజూరైన పోస్టుల విషయంలో కూడా మంత్రి సూచనలను పట్టించుకోకుండా నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు సమాచారం.



కలెక్టర్‌ కినుక

గత నెలలో మంత్రి ఐకే రెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జేసీ శివలింగయ్య, ఇతర అధికారులంతా హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్‌ లేరు. కలెక్టర్‌ ఇలంబరిది సెలవుల్లో ఉన్న సమయంలో ఆయన చాంబర్‌లోనే సమావేశం ఏర్పాటు చేయడంపై కలెక్టర్‌ కినుక వహించినట్లు తెలిసింది. మంత్రి తనకు కాకుండా జేసీ శివలింగయ్యకు ప్రాధాన్యత ఇస్తుండడం కూడా ఆయన అసంతృప్తికి కారణంగా చెప్పవచ్చు. కాగా బాసర సరస్వతి దేవాలయంలో చోటు చేసుకుంటున్న విపరీత పరిణామాల విషయంలో కూడా మంత్రికి, అధికార యంత్రాంగానికి మధ్య దూరం పెంచుతున్నట్లు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top