పెంపుపై కొబ్బరి రైతుల పెదవి విరుపు

పెంపుపై కొబ్బరి రైతుల పెదవి విరుపు - Sakshi

అమలాపురం : కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు జిల్లా రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.550 పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైస్‌ (సీఏసీపీ) సిఫారసు మేరకు కేంద్రం ఈ ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఎండుకొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్‌ సాధారణ రకం రూ.5,950 ఉంది. తాజా పెంపుతో ఇది రూ.6,500కి పెరిగింది. బాల్‌కోప్రా రూ.6,240 ఉండగా, తాజాగా రూ.6,790కి చేరింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే క్వింటాల్‌కు రూ.575 పెంచగా, తరువాత కనీస మద్దతు ధర పెంచింది ఈసారే. కానీ పెరిగిన పెట్టుబడులతో పోలిస్తే ఈ పెంపువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఎండు కొబ్బరి ధర క్వింటాల్‌ రూ.7 వేల నుంచి రూ.7,200 వరకూ ఉంది. ఇదే సమయంలో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర సహితం రూ.7 వేలు ఉంది. దీంతో ఎండుకొబ్బరి తయారీ పెద్దగా జరగడం లేదు. పచ్చికాయ ధర తగ్గినప్పుడు రైతులు ఎండు కొబ్బరి తయారు చేస్తూంటారు. నాఫెడ్‌ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు తమకు నిరాశ కలిగించిందని కొబ్బరి రైతులు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిసి కోనసీమకు చెందిన రైతులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి సురేష్‌ప్రభులను గత ఏడాది అక్టోబరులో కలిశారు. పెట్టుబడులతోపాటు రైతు కుటుంబాలకు అయ్యే ఆదాయ వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.17 వేలు చెల్లించాలని కోరారు. వారి సూచనల మేరకు సీఏసీపీ చైర్మన్‌ విజయ్‌పాల్‌శర్మను కలిసి ఇదే డిమాండ్‌పై వినతిపత్రాలు అందజేశారు. కనీసం రూ.10 వేలు చేసినా ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని రైతులు ఆశించారు. అయితే వారి ప్రయత్నాలను పట్టించుకోని కేంద్రం.. ఈసారి పెంపును రూ.550కే పరిమితం చేసింది. తమిళనాడు కాంగాయంతోపాటు మన జిల్లాలోని కోనసీమలోనే ఎండు కొబ్బరి ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఈ ఉత్పత్తి పైనే అంబాజీపేట మార్కెట్‌లో 80 శాతం లావాదేవీలు జరుగుతూంటాయి. ధర పెంపు స్వల్పంగా ఉండడంవల్ల ఎండు కొబ్బరి తయారీ పరిశ్రమ కోలుకునే అవకాశం లేదని రైతులు, వ్యాపారులు అంటున్నారు. ‘పాత ధర మీద ఎంతో కొంత పెంచితే చాలన్నట్టుగా ఉంది సీఏసీపీ పరిస్థితి. ‘ఈమాత్రం దానికి సమీక్షలు.. సమావేశాలు.. నివేదికలు కోరడాలెందుకు? అసలు సీఏసీపీ ఎందుకు?’ అని అంబాజీపేటకు చెందిన రైతు, బీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top