కో(ళ్ల)ట్ల పందాలు!

కో(ళ్ల)ట్ల పందాలు! - Sakshi


కన్నెత్తి చూడని పోలీసులు

నగర శివార్లు, జిల్లాలోనూ హోరు

కొన్నిచోట్ల టీడీపీ బ్యానర్ల ఏర్పాటు




విశాఖపట్నం: కోళ్ల పందాలు రూ.కోట్లు దాటాయి. సుప్రీంకోర్టు ఆంక్షలను తోసిరాజని నిరాటంకంగా సాగిపోయాయి. వాటిని నిలువరించాల్సిన పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం మానేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అనేక ప్రాంతాల్లో భోగి పండగ నుంచి పందాలను ప్రారంభించేశారు. గతంలో పోలీసులు దాడులు చేస్తారన్న భయంతో ఏదో మారుమూల ప్రాంతాల్లో వీటిని నిర్వహించేవారు. అయితే ఈ సంవత్సరం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. నగర శివారు ముడసర్లోవ, పెందుర్తి, భీమిలి మండలాల్లోను, జిల్లాలోని నక్కపల్లి, ఎస్‌.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అనకాపల్లి,  చోడవరం, గొలుగొండ, రోలుగుంట, బుచ్చయ్యపేట, రావికమతం, నాతవరం తదితర మండలాల్లోని వందలాది గ్రామాల్లో కోడి పందాలు జోరుగా సాగాయి.



పలు ప్రాంతాల్లో టీడీపీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు వీటికి నాయకత్వం వహించారు. మరికొన్ని చోట్లయితే ఏకంగా ఆ పార్టీ నాయకులకు స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేసి మరీ కోడి పందాలను నిర్వహించారు. పందాల్లో అధికార పార్టీ నాయకులున్నారన్న సంగతి తెలిస్తే పోలీసులు వాటి ఛాయలకు రారన్న వ్యూహంతో ముందుకెళ్లారు. అందుకు తగ్గట్టే పోలీసులు కూడా అసలు అక్కడ పందాలు జరుగుతున్నాయన్న సంగతే తెలియనట్టు నటించారు. భారీ ఎత్తున కోడిపందాలు జరిగే ప్రాంతాల పరిధిలోని స్టేషన్ల పోలీసు అధికారులు తాము సంక్రాంతి సెలవుల్లో ఉన్నామని తప్పించుకోవడానికి వీలుగా ముందుగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. మరోవైపు పందాల నిర్వాహకులు ఆయా పరిధిలోని పోలీసు అధికారులకు ముందస్తుగా ముడుపులు ముట్టజెప్పి వారిని కట్టడి చేశారన్న ఆరోపణలున్నాయి.  



ఎక్కడెక్కడ?

విశాఖ నగర శివారులోని ముడసర్లోవ వెనక ప్రాంతంలో భోగి రోజు ప్రారంభమై సంక్రాంతి, కనుమ రోజు వరకు కోడి పందాలు అట్టహాసంగా జరిగాయి. అక్కడ నాలుగు పందెం బరులను సిద్ధం చేసి భారీగా టెంట్లు వేశారు. మందుబాబులు మజా చేయడానికి కావలసినంత మద్యాన్ని అందుబాటులో ఉంచారు. ఫుడ్‌కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధి నేతృత్వంలో సాగిన ఈ పందాలకు ఆయన పేరిట స్వాగత బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. రోజుకు లక్షలాది రూపాయలు పందాలు జరిగాయి. అక్కడకు పోలీస్‌ స్టేషన్‌ కూతవేటు దూరంలోనే ఉన్నా పోలీసులకు ఆ పందాలు అసలు కనిపించలేదు. పైగా అక్కడ ఎస్‌ఐ, సీఐలు సెలవుపై వెళ్లిపోయారు. ఇక భీమిలి మండలం చిప్పాడ, బక్కన్నపాలెం, ఆశపాలెం, పెందుర్తి నియోజకవర్గం మొగిలిపురం, గుల్లేపల్లి, అలకందల, అయ్యన్నపాలెం, గురమ్మపాలెం, పెదగాడి, ఆనందపురం మండలం గొట్టిపల్లి, పెద్దిపాలెం తదితర గ్రామాల్లోనూ పందాలు జోరుగా హుషారుగా సాగాయి. అలాగే నక్కపల్లి మండలం వేంపాడులో భారీ స్థాయిలో మూడు రోజుల పాటు కోడి పందాలు నిర్వహించారు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి, పెదగుమ్ములూరు, బసవపాడు, పిట్లపాలెం, యలమంచిలి మండలం ఏటికొప్పాక తోటల్లోను, రాంబిల్లి మండలం రాంబిల్లి, లాలంకోడూరు, కట్టుబోలు, మురకాడ, అనకాపల్లి మండలం వెంకుపాలెం, సీతానగరం, మెట్టపాలెం, తగరంపూడి, మునగపాక మండలం రాజుపేట, చోడవరం మండలం అడ్డూరు, గొలుగొండ మండలం చిట్టింపాడు, రోలుగుంట, బుచ్చియ్యపేట, రావికమతం మండలాల్లోని పలు గ్రామాల్లోనూ కోడి పందాలు గణనీయంగా జరిగాయి.



ఇలా సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లాలోనూ, నగరంలోనూ జరిగిన కోడి పందాల బెట్టింగులు రూ.కోట్లలో ఉంటాయని తెలుస్తోంది. కాగా కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయో జనానికి బాహాటంగా తెలిసినందున పోలీసులు అక్కడక్కడ రెండు మూడు కోళ్లను పట్టుకుని తూతూమంత్రపు కేసులు నమోదు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top