తడారని కళ్లు


ఆదుకోని ‘ఆపద్బంధు’

సీఎం సహాయ నిధి కరువు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో 31 దరఖాస్తులు




ఆదిలాబాద్‌ అర్బన్‌ : కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ఆపద్బంధు పథకం బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేకపోతోంది. ఆపత్కాలంలోనూ వారిని ఆదుకోలేకపోతోంది. అయిన వారిని కోల్పోయి సహాయం కోసం కుటుంబ సభ్యులు చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తున్నా వారికి నిరాశే మిగులుతోంది. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందడం లేదు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి తన హయాంలో ఆపద్బంధు పథకం ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు పథకాన్ని   పట్టించుకోకపోవడంతో బాధితులకు సాయం అందడం లేదు. ఫలితంగా లబ్ధిదారులకు చెల్లించే ఆర్థికసాయం నుంచి గతంలోనే ప్రభుత్వం వైదొలిగి.. ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అప్పగించడం పథకంపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఏటా అక్టోబర్‌ 2నుంచి వచ్చే ఏడాది అక్టోబర్‌ ఒకటి వరకు బీమా చెల్లింపు గడువు విధించి బీమా సంస్థల ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా ఆర్థిక సాయం ఆలస్యమవుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వమే నేరుగా అపద్భందు పథకం కింద ఆర్థికసాయం అందించాలని బాధిత కుటుంబాలవారు కోరుతున్నారు.



జిల్లాలో ఇదీ పరిస్థితి..

దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లోని 18నుంచి 69ఏళ్లలోపు పోషకుడు, కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. విద్యుత్‌షాక్, ప్రమాదం, పాముకాటు, ప్రమాదవశాత్తు నీళ్లలో మునగడం, అగ్ని ప్రమాదం తదితర కారణాలతో మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. రూ.50వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. తెల్లరేషన్‌ కార్డు ఉండి ఆమ్‌ ఆద్మీ బీమా పథకం, అభయహస్తంలో బీమా పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలులేదు. కాగా.. ఏడాదిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 223 దరఖాస్తులు ఈ పథకం అధికారులకు అందాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపిన అధికారులు అందులోంచి 192 మందిని అర్హులుగా తేల్చి మంజూరు చేశారు. మిగతా 31 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బాధితులు దరఖాస్తుతో పాటు సరైనా వివరాలు అందించకపోవడం, దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం, పత్రాలు సరిగ్గా లేకపోవడం, డెత్‌ సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉండడంతో దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. సరైనా వివరాలు అందిస్తే ఆర్థికసాయం మంజూరుకు ఏ ఆటంకాలు ఉండవని, వివరాలు సరిగ్గా లేకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.



పథకంపై అవగాహన శూన్యం

ఆపద్బంధు పథకం కింద దరఖాస్తు చేసుకుని ఆర్థికసాయం పొందేందుకు ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించడంలేదనే ఆరోపణలున్నాయి. కొందరు దీనిపై అవగాహన లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ప్రజల్లో దీనిపై ప్రచారం లేకపోవడంతో పథకం అమలుకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. ఏయే వివరాలు అందించాలో.. తెలియక బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దరఖాస్తు చేసేందుకు దూరప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పథకంపై ప్రజల్లో అవగాహన... బీమా అందించేందుకు అధికారులు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top