వేసవి జాగ్రత్తలపై సీఎం సమీక్ష

వేసవి జాగ్రత్తలపై సీఎం సమీక్ష

- నీటి ఎద్దడి నివారణ, వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలకు ఆదేశం 

- అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచన

 

కర్నూలు (అర్బన్‌): వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి, వడగాల్పుల నుంచి రక్షణకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లాం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వడగాల్పులు, తాగునీటి సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన తెలుసుకున్నారు.  ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారన్నారు. పశువులకు గ్రాసం, నీటి కొరత ఉందన్నారు. దీంతోపాటు వడగాడ్పుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పశుగ్రాసం, తాగునీటి పథకాల నిర్వహణకు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో 56 సీపీడబ్ల్యూ స్కీముల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.

 

25 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను 80 శాతం మేర నీటితో నింపినట్లు తెలిపార. వచ్చే నెల 1వ తేదీ నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారని,  ఈ నీటితో కాలువ పరివాహక ప్రాంతాల్లోని ఎస్‌ఎస్‌ ట్యాంకులను కూడా నింపుతామన్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరత లేదని తెలిపారు. తాగునీటి కోసం సీఆర్‌ఎఫ్‌ కింద రూ.10 కోట్లు, నాన్‌ సీఆర్‌ఎఫ్‌ కింద రూ.6 కోట్ల ప్రతిపాదనలు ఇది వరకే సమర్పించామని కలెక్టర్‌ వివరించారు.  కార్యక్రమంలో నంద్యాల, ఆదోని, కర్నూలు ఆర్‌డీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జేడీలు, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు, డీఎంఅండ్‌హెచ్‌ఓ తదితరులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top