రిజిస్ట్రేషన్ ధరలు యథాతథం

రిజిస్ట్రేషన్ ధరలు యథాతథం - Sakshi


పెంపునకు సీఎం కేసీఆర్ నో!

 వార్షిక లక్ష్యం చేరుకునేందుకు ఈ మార్గం వద్దని సూచన

 వచ్చేనెల 1 నుంచి పోస్టాఫీసుల్లోనూ స్టాంపుల విక్రయాలు

 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రెండు షిఫ్టుల పద్ధతికి యోచన

 ఆగస్టు నుంచి హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలన్న రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ ఏడాది ధరల పెంపు వద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ధరల పెంపు మార్గాన్ని ఎంచుకోవద్దని రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించినట్లు తెలిసింది. ఏటా ఆగ స్టులో భూముల రిజిస్ట్రేషన్ ధరలను సమీక్షించడం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా రిజిస్ట్రేషన్ ధరలను పెంచేందుకు గత రెండునెలలుగా అధికారులు కసరత్తు చేశారు. ప్రాంతాల వారీగా భూమి ప్రస్తుత విలువపై 10 నుంచి 30 శాతం వరకు విలువ పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

 

 ప్రజలు కోరితే ధరల తగ్గింపు..

 

 మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రజలు కోరితే ఆయా భూముల రిజిస్ట్రేషన్ ధరలను తగ్గించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రిజిస్ట్రేషన్ ధర తగ్గింపు కోరేవారు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే సవరణల కమిటీ ఆ భూమి విలువ సమీక్షించి, తగ్గింపునకు అవసరమైన చర్యలు చేపడుతుందని వివరించారు. రిజిస్ట్రేషన్ల ధరల తగ్గింపు కోరేందుకు నిర్దిష్ట గడువు ఏమీ లేదని, ఈ ప్రక్రియ ఏడాది పొడవునా కొనసాగుతుందని తెలిపారు.

 

 పోస్టాఫీసుల ద్వారా స్టాంపులు..




 రిజిస్ట్రేషన్ స్టాంపులు ప్రజలకు మరింత అందుబాటులో ఉంచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసుల ద్వారా ఈ స్టాంపులను విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే పోస్టల్ శాఖతో సంప్రదింపులు జరిపిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు.. ఈ ప్రక్రియను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టాంపుల విక్రయానికి వెండర్‌కు ఇస్తున్నట్లే పోస్టల్ శాఖకు కూడా కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. వెండర్లు స్టాంపులను అసలు ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

 

 

 ఇక కుదిరిన టైంలో..

 

 రాష్ట్రంలో రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను షిఫ్టు పద్ధతిన నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలు, ఇతర ముఖ్య పట్టణాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తే ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టుల్లో కార్యాలయాలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానాన్ని వచ్చేనెల నుంచి హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇది విజయవంతమైతే మిగిలిన నగరాలు, పట్టణాల్లో కూడా షిఫ్టు పద్ధతిని అమలు చేస్తారు. దీనిద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వివిధ రకాల వృత్తులు, వ్యాపారాలు చేసేవారు.. వారికి వీలైన సమయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top