ఆర్టీసీకి ‘సెట్విన్’ గండం!

ఆర్టీసీకి ‘సెట్విన్’ గండం! - Sakshi


సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ఝలక్ ఇవ్వబోతోంది. నగరంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగరానికి సంబంధించి ప్రభుత్వం రకరకాల ‘సంక్షేమ’ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే 8 వేల కొత్త ఆటోలు రోడ్డెక్కేందుకు అనుమతి ఇచ్చిన సర్కారు తాజాగా సెట్విన్ మినీ బస్సులపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి పేరుతో కీలక మార్గాల్లో సెట్విన్ బస్సులు నడుపుకునేందుకు అనుమతిచ్చే యోచనలో ఉంది. యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ సంయుక్తంగా 100 బస్సులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ఆమోదముద్ర పడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆర్టీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.



 పడిపోయిన ఆదాయం నెలకు రూ.5 కోట్లపైనే

 రాష్ట్ర విభజన, ఏపీకి కొత్త రాజధాని ప్రాంతం ఖరారు నే పథ్యంలో నగరం నుంచి ఆంధ్ర ప్రాంత ప్రజల వలస కూడా మొదలైందని ఆర్టీసీ తన అంతర్గత సర్వేలో తేల్చింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో ప్రతినెలా రూ.2.5 కోట్ల బస్‌పాస్ ఆదాయాన్ని కోల్పోతున్నట్టు గుర్తించింది. దీంతోపాటు మరో రూ.3 కోట్ల వరకు సాధారణ టికెట్ కలెక్షన్ తగ్గిందని ప్రభుత్వానికి తెలిపింది. ఏడాది క్రితం నగరంలో సిటీబస్సుల ఆక్యుపెన్సీ రేషియో 75-78 శాతం మధ్య నమోదు కాగా, ఇప్పుడది 70 శాతానికంటే తక్కువకు పడిపోయింది. కొన్ని మార్గాల్లో 60 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, నగరంలో ఆర్టీసీకి ఒక్క అక్టోబర్‌లోనే ఆదాయం కంటే రూ.132 కోట్ల వ్యయం ఎక్కువైంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.500 కోట్లను మించాయి. ఇలాంటి తరుణంలో సెట్విన్ బస్సులకు అనుమతిస్తే పరిస్థితి మరింత దారుణంగా పడిపోతుందని తేల్చి చెప్పింది.



 బడా వ్యక్తుల చేతుల్లోకి..

 నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా 1980లో సెట్విన్ బస్సులు రోడ్డెక్కినప్పటికీ ప్రస్తుతం అవి బడా వ్యక్తుల చేతుల్లోకి చేరాయి. లక్ష్యాన్ని నీరుగారుస్తూ ప్రైవేటు ఆపరేటర్ల తరహాలో ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతున్నాయి. కొత్తగా మంజూరు చేసే సెట్విన్ బస్సులనూ బడా వ్యక్తులే చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గతంలోనే సుప్రీంకోర్టు... పట్టణాల్లో ప్రజా రవాణా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలంటూ తీర్పు వెలువరించింది.



 సీఎం భేటీలో కీలకం

 ఆర్టీసీ వరస నష్టాలతో కుదేలవుతున్న నేపథ్యంలో సీఏం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో సెట్విన్ బస్సుల అంశాన్ని లేవనెత్తాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సెట్విన్ బదులు ఆర్టీసీ సొంతంగా మినీ బస్సుల సంఖ్య పెంచుకునే యోచనలో ఉంది. ఇదే విషయాన్ని సీఎం ముందుంచాలని నిర్ణయించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top