ప్రజలకు చేస్తున్నది ప్రభుత్వ సొమ్ముతోనే


  •  ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు మతి లేనివి

  • -ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

  • రావులపాలెం (కొత్తపేట):

    ప్రజాధనాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు వినియోగిస్తూ అది తన సొంత నిధులతో చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం చూస్తే ఆయనకు వయసు పైబడటమో మతి భ్రమించిందో అర్థం కావడం లేదని రాష్ట్రంలోని వైద్యులు ఆయనకు ఉచితంగా చికిత్సను అందజేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి రావులపాలెం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అదేదో తన హెరిటేజ్‌ సంస్థ ఆదాయం ద్వారానో లేక తన సొంత రెండెకరాల భూమి ఆదాయం ద్వారానో చేస్తున్నట్టుగా చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తన ఓట్లు వేయకపోతే పింఛన్‌ను ఇవ్వను రేషన్‌ ఇవ్వను అంటూ ప్రజలను కించపర్చేలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారుతున్నారన్నారు. తనకు ఓటు వేయని గ్రామాలకు దండం పెడతానే తప్ప ఎలాంటి పనులు చేయనని, తాను వేసిన రోడ్లపై నడుస్తున్నారని ఆయన చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఆయన పుట్టకముందు నుంచే రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ ఉందని ప్రభుత్వమే రోడ్లు వేస్తుందని ఆయనకు మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారన్నారు. నంద్యాల  ఉప ఎన్నికలో తమ పార్టీకి ఓట్లు వేయకపోతే ఏమీ చేయనని బహిరంగంగా చంద్రబాబు బెదిరింపులు ప్రలోభాలకు పాల్పడుతున్నారన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్‌ కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని, జాతీయ జెండాకు వందనం చెప్పడం రాని లోకేష్‌ విశాఖ భూముల కుంభకోణంపై  సవాల్‌ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన అసమర్థతను గుర్తించే చంద్రబాబు ప్రజల నుంచి నెగ్గలేడని భావించి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. దమ్ముంటే నంద్యాల ఉప ఎన్నికలో లోకేష్‌ పోటీ చేసి గెలవాలని సవాల్‌ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, వైస్‌ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, కముజు సత్యనారాయణ, అప్పన రామకృష్ణ, జక్కంపూడి లక్ష్మినారాయణ, సఖినేటి కృష్ణంరాజు, తదితరులు ఉన్నారు.  

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top