'పెద్దకొడుకునని చెప్పి మోసం చేశాడు'

'పెద్దకొడుకునని చెప్పి మోసం చేశాడు' - Sakshi


మచిలీపట్నం (చిలకలపూడి): ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు తమను మోసం చేశారని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. పెంచిన జీతాలను ఇవ్వడానికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు.



ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బరావమ్మ సాక్షితో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు సుమారు 98వేల మంది వరకు ఉన్నారన్నారు. వీరి వేతనాల పెంపుదల కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ప్రభుత్వం తమ గొంతునొక్కే కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. మార్చి 17న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 7,100, హెల్పర్‌కు రూ. 6,700 పెంచుతున్నట్లు హామీ ఇచ్చి సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించారన్నారు.



నెలలు గడుస్తున్నా ఇంత వరకు జీవో మాత్రం విడుదల చేయలేదన్నారు. ఇటీవల రాజధాని నిర్మాణం కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీనవర్గాలైన తమకు తమకు రూ. 300 కోట్లు బడ్జెట్ కేటాయించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. తక్షణమే పెంచిన వేతనాలకు జీవో విడుదల చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top