ఇండియాలోనే ఉన్నామా అనిపించింది: చంద్రబాబు

ఇండియాలోనే ఉన్నామా అనిపించింది: చంద్రబాబు - Sakshi


- విశాఖలో ప్లీట్ రివ్యూ అదరహో అన్న ముఖ్యమంత్రి

- అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణతో నగర ఖ్యాతి పెరిగిందని వ్యాఖ్య



విజయవాడ:
ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించడం ద్వారా విశాఖపట్నం కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్లీట్ రివ్యూ నిర్వహణా విశేషాలను పంచుకున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు సహా 50 దేశాలకు చెందిన ప్రతినిధులను ఏపీ ప్రభుత్వం తరఫున సగౌరవంగా సత్కరించామని సీఎం చెప్పారు. కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించినందుకు ఇండియన్ నేవీకి  కృతజ్ఞతలు తెలిపారు.


'సాధారణంగా  రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అరుదు. అలాంటి విశేషానికి మన రాష్ట్రం వేదికైనందుకు ఆనందంగా ఉంది. భారత నౌకాదళానికి కేంద్ర బిందువుగా విశాఖను ఎన్నుకోవడం మనకు గర్వకారణం. ప్లీట్ రివ్యూ సందర్భంగా నేవీ ఉన్నతాధికారులు ఆ విషయాన్ని ప్రకటించడం సంతోషకరం. విశాఖ ఇప్పుడొక అంతర్జాతీయ నగరం. ప్లీట్ రివ్యూ వేడుకలు చూస్తుంటే అసలు ఇండియాలోనే ఉన్నామా? అనే సందేహం వచ్చింది. నౌకాదళ పాటవ ప్రదర్శనకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. మంచి సంఘటనకు స్పందించిన ప్రజలందరినీ అభినందిస్తున్నా' అని సీఎం చంద్రబాబు అన్నారు.


రెండేళ్ల కిందట విశాఖను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపానును ప్రస్తావిస్తూ.. ఆ సందర్భంలో  మాట ఇచ్చినట్లు ఏడాది తిరిగేలోగా వైజాగ్ రూపురేఖల్ని మార్చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు విశాఖ అనువైన ప్రాంతమని, గత నెలలో 44 దేశాల ప్రతినిధులతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్ కూడా విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు. సీఐఐ సదస్సులో రాష్ట్రానికి 4.70లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామన్నారు. తాజాగా నిర్వహించిన  ప్లీట్ రివ్యూ కూడా విశాఖ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిందన్నారు. కార్యక్రమాలను నిర్వహించిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు లభించాయని సీఎం చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top