భూములివ్వని రైతుల్ని ఎవరూ కాపాడలేరు

భూములివ్వని రైతుల్ని ఎవరూ కాపాడలేరు - Sakshi


ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానికి భూ సమీకరణ (పూలింగ్)కు సహకరించని రైతులను ఎవరూ కాపాడలేరని, వారి భూములను కూడా భూ సేకరణ (ల్యాండ్ ఎక్విజిషన్)లో తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికైనా ముందుకొచ్చి భూ సమీకరణలో భూములు ఇస్తే సంతోషమని, లేకుంటే అక్టోబర్ నెలాఖరులోపు 2,500ఎకరాలు కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. వారికి ఎటువంటి ఇన్సెంటివ్‌లు ఇచ్చేది లేదని హెచ్చరించారు.



గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన సభలో  నేలపాడు గ్రామ రైతులకు ప్లాట్లు పంపిణీ  కార్యక్రమంలో  సీఎం మాట్లాడుతూ భూ సమీకరణకు సహకరించకుండా కొందరు బెదిరింపులకు దిగారని, అయినా తాను లొంగలేదని అన్నారు. మొదటి దశలో రైతుల నుంచి సమీకరించిన 23,500 ఎకరాలకు ప్రభుత్వ భూమి కలిపి 53,748 ఎకరాలు సమకూరినట్టు చెప్పారు.

 

లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డానంటా..

రైతుల భూములు సీఆర్‌డీఏకి ఇస్తే తానేదో రాజధాని పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అంటున్నాయని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌కు చెందిన రెండు కంపెనీలకు సీఆర్‌డీఏ కంపెనీకి మధ్య స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పందం ఉంటుందని అన్నారు. ఇందులో సింగపూర్‌కు 58 శాతం, సీఆర్‌డీఏకు 42 శాతం వాటా ఉంటుందని చెప్పారు. సింగపూర్‌కు తొలిదశలో 200 ఎకరాలు కేటాయించామని, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు, దేశాలకు రాజధానిలో భూములు కేటాయిస్తున్నామన్నారు.

 

ఎవరికీ భయపడను..: కాపు రిజర్వేషన్ పేరుతో ట్రైన్ తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పంటున్నారని, మర్యాదగా ఉంటే తానూ మర్యాదగా ఉంటానని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భయపడనన్నారు.  

 కొమ్మినేని ఆదిలక్ష్మికి తొలిప్లాటు

 భూ సమీకరణకు మొదటిగా తమ భూములు ఇచ్చిన కొమ్మినేని ఆదిలక్ష్మికి తొలి ప్లాటును కేటాయిస్తూ సీఎం చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందించారు.



రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించి వాటికి రెండు నెలల్లోగా సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేశారు. ప్లాట్లు కేటాయింపునకు సంబంధించిన వివరాలను రైతుల మొబైల్స్‌కు మెస్సేజ్‌లు పంపించారు.

 

తొలి రోడ్డు తొమ్మిది నెలల్లో పూర్తి..

జాతీయ రహదారి 5 నుంచి సీడ్ క్యాపిటల్‌కు చేపట్టే తొలి ప్రాజెక్టుగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తొమ్మిది నెలల్లో పూర్తిచేస్తామని చంద్రబాబు అన్నారు. రూ.248.3 కోట్లతో 18.3 కిలోమీటర్ల నాలుగులైన్ల రోడ్డు పనులకు  వెంకటపాలెంలో సీఎం శంకుస్థాపన చేశారు.

 

అన్న క్యాంటీన్‌లో తిని పడుకోవద్దు..

అన్న క్యాంటీన్ ఉంది కదా అని భోజనం చేసి ఇంటి దగ్గర పడుకుంటే కష్టమని, అందరూ కష్టపడాలని చంద్రబాబు చమత్కరించారు. వెలగపూడిలో శనివారం మంత్రి పరిటాల సునీతతో కలిసి చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రమంతటా అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top