టీడీపీ కాపులపై చంద్రబాబు చిందులు

టీడీపీ కాపులపై చంద్రబాబు చిందులు - Sakshi


♦ ముద్రగడపై ఎదురుదాడి చేయడం లేదని ఆగ్రహం

♦ ‘కాపు’ కార్డుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజం

♦ ఉద్యమాన్ని ఎలా అణచాలో తెలుసని తీవ్ర వ్యాఖ్యలు

♦ తరువాత మీ సంగతి తేలుస్తానని హెచ్చరికలు

 

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘డిప్యూటీ సీఎంతో సహా మీకే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చాను. మీకు రాజకీయ జీవితం ఇచ్చాను. ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాను. కానీ కీలక సమయంలో మీరెవ్వరూ నాకు అండగా ఉండటం లేదు. ముద్రగడపై ఎదురుదాడి చేయడం లేదు. కాపు ఉద్యమాన్ని ఎలా పక్కదారి పట్టించాలో నాకు తెలుసు. తరువాత మీ సంగతి తేలుస్తా...’ అని చంద్రబాబు టీడీపీ కాపు నేతలపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. 



‘కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారేమో... ఉద్యమాన్ని ఎలా పక్కదారి పట్టించాలో నాకు తెలుసు. తరువాత మీ సంగతి తేలుస్తా’ అని కూడా ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించడంతో కాపు సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు నివ్వెరపోవాల్సి వచ్చింది. టీడీపీ కాపు నేతలతో సీఎం చంద్రబాబు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్‌లో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదే సందర్భంగా ముద్రగడ పద్మనాభంతో గురువారం జరిపిన చర్చల వివరాలు తెలిపేందుకు ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమామహేశ్వరరావు ఆయన్ను కలిశారు.



ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతోపాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు తదితరులను కూడా సీఎం తన వద్దకు పిలిపించారు. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలసి కాపు ఉద్యమం, ముద్రగడ వ్యవహారంపై అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్రతను వివరించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా బాబు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దీక్షకు దిగకుండా ముద్రగడను ఒప్పించడంలో విఫలమయ్యారని వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.



ఉప ముఖ్యమంత్రి పదవితోసహా మంత్రి పదవులు పొందినప్పటికీ కాపు సామాజికవర్గంపై పట్టు సాధించలేకపోయారని వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా సన్నాహాలు చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని  ప్రశ్నించారు. ‘మీరు కావాలనే ఇలా చేశారనిపిస్తోంది. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో నాకు తెలుసు. న్యాయపరమైన వివాదాలు సృష్టించి ఉద్యమాన్ని పక్కదారి పట్టించగలను. ఉద్యమం చల్లారిన తరువాత మీ పరిస్థితి ఏమిటో చూసుకోండి.



అప్పుడు చెబుతాను మీ పని.  నేను తలచుకుంటే మీలాంటి వారిని వందమందిని తయారు చేయగలను’ అని  సీఎం వ్యాఖ్యానించడంతో మంత్రులు నిశ్చేష్టులైపోయారు. చంద్రబాబు ఇదేమీ పట్టించుకోకుండా తన ఆగ్రహావేశాలను కొనసాగించారు. కాపు ఉద్యమం వల్ల తన పరపతి పోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనతో కొన్ని దేశాలు విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా ఐఎఫ్‌ఆర్‌కు రాకూడదని భావించాయని చెప్పారు. ఈ అంశంపై కేంద్రం వాకబు చేయడం తనకు అవమానకరంగా తోచిందన్నారు. వెంటనే ముద్రగడ మీద ఎదురుదాడి చేయాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. సీఎం  తీరుపై కాపు సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. సీఎంతో సమావేశం అనంతరం వారు ఓ అతిథి గృహంలో కాసేపు సమావేశమై ఈ అంశంపై మాట్లాడుకున్నారు. సీఎం ఏదైనా చెప్పాలంటే వ్యక్తిగతంగా చెప్పాలిగానీ పరకాల  ముందు తమపై చిందులు తొక్కడమేమిటని వారు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top