కాపులు ఓపిక పట్టాల్సిందే..!

కాపులు ఓపిక పట్టాల్సిందే..! - Sakshi


కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చంద్రబాబు

ముద్రగడ డిమాండ్లకు అర్థం లేదన్న మంత్రులు


 

 సాక్షి, విశాఖపట్నం: కాపులకు రిజర్వేషన్ల విషయంలో కమిషన్ నివేదిక వచ్చేవరకు కాపులు ఓపిక పట్టాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరంగా ముద్రగడతో దీక్ష విరమింపజేసేందుకు ఆ జిల్లా నేతలు కృషి చేయాలని సూచించారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం భార్యతో సహా చేస్తున్న ఆమరణ దీక్ష, తదనంతర పరిణామాలపై కేబినెట్ సబ్ కమిటీ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. సర్క్యూట్ హౌస్‌లో జరిగిన ఈ కీలక భేటీలో మంత్రులు యనమల రామకష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప, నారాయణ, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ఎస్‌సీఎస్‌ఎన్ వర్మ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తదితరులు పాల్గొన్నారు.



విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రస్తుత పరిస్థితిలో ఎటూ ముందుకు వెళ్లలేమని, అందువల్ల కమిషన్ నివేదిక వచ్చేవరకు కాపులు ఓపిక పట్టాల్సిందేనని సమావేశంలో సీఎం అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. చర్చలకు ప్రయత్నిస్తున్నా ముద్రగడ దీక్ష కొనసాగించడంలో అర్థం లేదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ ముద్రగడ తన వైఖరిని మార్చుకోకపోవడాన్ని వారు ఆక్షేపించారు. రిజర్వేషన్ అంశం ఒక అడుగు ముందుకు పడినా బీసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు  ఉన్నాయని, అందువల్ల ఆచితూచి స్పందించాల్సిన అవసరముందని మంత్రులు యనమల, గంటా, చినరాజప్పలు సూచించినట్లు తెలిసింది. కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్ పెంచే విషయాన్ని మాత్రం పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.



 ముద్రగడ మొండి వైఖరి వీడాలి

 సమావేశం అనంతరం మంత్రులు యనమల, చినరాజప్పలు మీడియాతో మాట్లాడుతూ కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని అన్నారు. ఈ సమయంలో ముద్రగడ చేస్తున్న డిమాండ్లకు అర్థం లేదన్నారు. బీసీలకు ఎలాంటి నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశంపై మంజునాథ కమిషన్ కసరత్తు చేస్తోందని, కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్ల విషయంలో ముందుకు వెళతామని చెప్పారు. ఇప్పటికైనా ముద్రగడ మొండివైఖరి వీడి దీక్షను విరమించాలని డిమాండ్ చేశారు. ముద్రగడ ఉచ్చులో పడి కాపులు ఉద్రేకాలకు లోనుకావద్దని, అలాగే బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు కూడా సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.



 మోకాలడ్డుతున్న మంత్రి!

 ముద్రగడతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించే అంశంలో మొదటి నుంచీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి మోకాలడ్డుతున్నట్లు కాపు ఉద్యమ నాయకులు, ముద్రగడ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దిగి వెళ్లి ముద్రగడతో సంప్రదింపులు జరిపితే కాపు సామాజిక వర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా తన రాజకీయ ఆధిపత్యానికి గండి పడుతుందన్న భయంతోనే సదరు మంత్రి సంప్రదింపుల అంశాన్ని వెనక్కి లాగుతున్నట్లు కిర్లంపూడిలో కాపు సామాజిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు దౌత్యం కూడా ఈ కారణంగానే ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదని చెబుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top