సమస్యలు పరిష్కరించాలని కోరా

సమస్యలు పరిష్కరించాలని కోరా - Sakshi


♦ ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు

♦ ప్రధాని, పలువురు మంత్రులతో భేటీ

♦ రెవెన్యూ లోటు భర్తీ చేయాలని విజ్ఞప్తి

♦ అమరావతికి ఎక్సైజ్ మినహాయింపుకై వినతి

 

 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యాయని, మిగతావి పరిష్కరించాలని ప్రధానిని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, బీరేంద్ర సింగ్, సురేశ్ ప్రభు, నితిన్ గడ్కరీలను కలిశాను. రాష్ట్ర సమస్యల గురించి ప్రధానికి, ఆర్థిక మంత్రికి వివరించాను. విభజనకు ముందే రెవెన్యూలోటు నిర్ధారించారు. గత ఏడాదికి రూ. 16,071 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా రూ. 2,300 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ. 13,700 కోట్లు ఇవ్వాలి. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘం సిఫారసుల అనంతరం జరిపిన కేటాయింపులు సరిపోవడం లేదు. సీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు గత ఏడాది రూ. 50 కోట్ల చొప్పున ఇచ్చారు. ఈ ఏడాది రూ. 50 కోట్ల చొప్పున ఇచ్చారు. ఇది సరిపోదని చెప్పాం’’ అని తెలిపారు.



 రాజధాని నిర్మాణానికి గ్రాంటు కోరాం

 అమరావతికి 100 శాతం ఎక్సైజ్ మినహాయింపు, 100 శాతం ఇన్‌కంటాక్స్ మినహాయింపు, 15శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ ఇవ్వాలని కోరామని చంద్రబాబు చెప్పారు. ‘‘రాజధాని నిర్మాణంలో అవసరమైన మౌలిక వసతులకు రూ. 850 కోట్లు ఇచ్చారు. గత ఏడాది రూ. 1000 కోట్లు గుంటూరు-విజయవాడకు స్పెషల్ గ్రాంటు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి చాలా నిధులు అవసరమని. ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని కోరాం’’ అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 2,485 కోట్లు ఖర్చు పెట్టామని, మిగిలిన నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని చెప్పారు.



పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన జాతీయ సంస్థలకు నిధులు తగిన రీతిలో కేటాయించాలని, కడపలో స్టీలు ప్లాంటు, విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు ఆర్థికసాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 225 చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే చట్టాన్ని సవరించాలని కోరినట్లు చెప్పారు. ‘‘సురేశ్ ప్రభును కలసి రైల్వేతో జాయింట్ వెంచర్‌పై చర్చించాం. ఏ ప్రాజెక్టులు అమలు చేయాలి? వేటికి నిధులు ఎంత అవసరం? ప్రైవేటు నిధులు ఎలా తేవాలి? వంటి అంశాలు  జాయింట్ వెంచర్‌లో ఇమిడి ఉన్నాయి. ఏ విధంగాప్రైవేటైజేషన్‌కు వెళ్లాలో వర్కవుట్ చేస్తున్నాం’’ అని చెప్పారు. గడ్కరీని కలిసి అమరావతి నుంచి అన్ని ప్రధాన నగరాలకు ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు చేయాలని కోరామని చంద్రబాబు చెప్పారు.



 నక్సలైట్ల తరహాలో ‘తుని’ ఘటనలు

 కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో జరిగిన సంఘటనలు నక్సలైట్లు, ఉగ్రవాదుల తరహాలో జరిగాయని, వీటి వెనక రాజకీయ పార్టీ ఉందని, వైఎస్సార్‌సీపీ నేతలు ముందుగా రెక్కీ చేశారని, బయటి నుంచి జనాన్ని తెచ్చారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

 

 నా మాటలు వక్రీకరించారు

 దళితులపై తను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు పేర్కొన్నారు. పేద కుటుంబంలో పుట్టాలని ఎవరూ కోరుకోరని, వారికి చేయూతనివ్వాలని చెప్పడమే తన ఉద్దేశమని, అయితే దీనిని వక్రీకరించారని స్పష్టంచేశారు. ఆయన మంగళవారం ఇక్కడ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘అత్యంత వెనకబడిన స్థితిలో ఎస్సీలు ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఎవరూ పేదవాళ్లుగా బతకాలనుకోరు. పేద కుటుంబంలో పుట్టాలని కోరుకోరు.. అని నేనంటే నేనేదో పాపపు పనిచేసినట్టు చెబుతున్నారు. సమాజంలో రెండే రెండు కులాలు. డబ్బులున్న వాళ్లు. డబ్బులు లేనివాళ్లు. ఈరోజు నేను పెట్టిన పథకాల వల్ల బీసీలు, ఎస్సీలు లబ్ధిపొందుతున్నారు. కులం, మతం, ప్రాంతం మత్తు వంటివి. వీటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ల వల్ల కాదు..’’ అని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top