మట్టిలో కూరుకుపోయిన సీఎం బస్సు

మట్టిలో కూరుకుపోయిన సీఎం బస్సు - Sakshi


- తన వాహనశ్రేణిలోని కారులో బయల్దేరిన ముఖ్యమంత్రి

- 40 నిమిషాల్లో సచివాలయ భవనాలు చూసి వెళ్లిపోయిన జపాన్ బృందం

వెనుక వచ్చి సమీక్షతో సరిపుచ్చిన సీఎం చంద్రబాబు

 

 సాక్షి, విజయవాడ బ్యూరో/తాడికొండ రూరల్: తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంగళవారం గుంటూరు జిల్లా వెలగపూడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం బ్లాక్ వద్దకు వెళ్లే సమయంలో బస్సు మట్టిలో కూరుకుపోయింది. బస్సును వెనుక భాగంలో క్రేన్ ద్వారా బెల్ట్ కట్టి లాగినప్పటికీ మొరాయించడంతో చేసేదేమీలేక ముఖ్యమంత్రి వాహన శ్రేణిలోని ఓ కారులో విజయవాడకు వెళ్లారు. అంతకుముందు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి రెండు హైటెక్ బస్సుల్లో వచ్చిన జపాన్ బృందం అక్కడ కాలు కిందపెట్టలేదు.



బస్సుల్లోంచి దిగకుండానే సచివాలయ భవనాలను చూసి వివరాలు తెలుసుకుని వెనుతిరిగింది. చంద్రబాబు అక్కడికి చేరుకోకముందే జపాన్ బృందం వచ్చి వెళ్లిపోవడంతో ఊహించని షాక్ తగిలినట్లయింది. వారు వెళ్లిపోయాక అక్కడికి చేరుకున్న చంద్రబాబు అధికారులతో సమావేశమై సచివాలయ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి వచ్చినందుకు ఏదో తంతు నడిపినట్టు ముగించారు. ఉద్దండ్రాయునిపాలెం వెళ్లిన జపాన్ బృందం బస్సులు దిగినప్పటికీ కేవలం ఐదు నిముషాల్లోనే అమరావతి రాజధాని నమూనాను పరిశీలించి వెనుదిరిగారు. అక్కడి నుంచి పాత అమరావతి వెళ్లి ధ్యానబుద్ద ప్రాజెక్టును చూస్తారని అనుకున్నారు. అయితే వారు అక్కడికీ వెళ్లలేదు.



మండే ఎండలకు జపాన్ బృందం బస్సులు దిగే సాహసం చేయకపోవడంతో సకల మర్యాదలు చేసి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతిలో పెట్టుబడుల కోసం ఏపీకి వచ్చిన 75 మంది జపాన్ పారిశ్రామికవేత్తల బృందం రెండ్రోజులపా టు ఇక్కడ ఉంది. జపాన్ బృందం తో  చంద్రబాబు సోమవారం విజయవాడ గేట్‌వే హోటల్‌లో సమావేశం నిర్వహించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జపాన్ పారిశ్రామికవేత్తల బృందం దిగినప్పటి నుంచి వారి కాళ్లు కిందపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అపురూపంగా చూసుకుంది. విమనాశ్రయం నుంచి వారిని ప్రత్యేకంగా బెంజి కార్లుతో తీసుకొచ్చారు. వారిని మెప్పించి పెట్టుబడులు పెట్టించేందుకు చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. మంగళవారం జపాన్ బృందం రాజధానిలో పర్యటిస్తుందని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయించుకున్న ప్రభుత్వానికి షాక్ తగిలింది.



 జలరవాణాకు వేదికగా దుర్గాఘాట్: చంద్రబాబు

 భవిష్యత్తులో అంతర్గత జలరవాణా మార్గానికి వేదికగా రూపొందేలా శాశ్వత ప్రాతిపదికన దుర్గాఘాట్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో జరుగుతున్న ఘాట్ల నిర్మాణ పనులను సీఎం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ గెస్ట్‌హౌస్ సమీపంలో దుర్గాఘాట్ వద్ద జరుగుతున్న పనుల తీరు పరిశీలించారు. టూరిస్టు పాయింట్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం కృష్ణవేణి ఘాట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సు నుంచే బందరు కాలువ, ఫ్లైవోవర్‌లను పరిశీలించారు.



Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top